బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు

బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు
  • కాలానికి అనుగుణంగా సిలబస్ మార్పు
  • ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి 
  • డిగ్రీలో ఫారిన్ కోర్సులు..
  • పీజీ, డిగ్రీ కోర్సులకు కామన్ క్యాలెండర్
  • బకెట్ సిస్టమ్​తో ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో చదువు 
  • ఇంటర్ రిజల్ట్ వచ్చిన రోజే దోస్త్ నోటిఫికేషన్ 
  • ఈ ఏడాది నుంచి క్లస్టర్ విధానం
  • ‘వీ6‑ వెలుగు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ 


హైదరాబాద్, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా హయ్యర్ ఎడ్యుకేషన్​లో కోర్సులు, సిలబస్​లో మార్పులు తెస్తున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. చదువు పూర్తికాగానే కొలువులు వచ్చేలా కోర్సులను డిజైన్ చేస్తున్నామని, అలాంటి వాటికే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. డిగ్రీ స్థాయిలో ఫారిన్​ కోర్సులు, వీలైన అటానమీ కాలేజీల్లో తరగతులకు హాజరయ్యేలా క్లస్టర్​ విధానం తెస్తున్నామన్నారు. డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సులు అందుబాటులో ఉండగా, ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్ టైల్స్ కోర్సు తీసుకొస్తున్నామని తెలిపారు. డిగ్రీ, పీజీలో కామన్ అడ్మిషన్ల విధానం కొనసాగుతోందని చెప్పారు. డిగ్రీలో ఇప్పటికే కామన్ క్యాలెండర్ అమలు చేస్తుండగా, పీజీలోనూ అదే విధానం అమలు చేయబోతున్నామన్నారు. ఇంటర్ రిజల్ట్ వచ్చిన రోజే డిగ్రీలో అడ్మిషన్లకు దోస్త్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నందున హయ్యర్ ఎడ్యుకేషన్​లో మార్పులపై ప్రొఫెసర్ లింబాద్రి ‘వెలుగు’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే..  
బీటెక్ వాళ్లు కూడా సోషల్ సైన్స్ చదవొచ్చు


డిగ్రీ, పీజీ కోర్సుల అడ్మిషన్ల విధానంలో స్టూడెంట్ల అభిరుచులకు అనుగుణంగా, క్రియేటివిటీని పెంచేలా మార్పులు చేస్తున్నాం. ఇప్పటికే డిగ్రీలో బకెట్ సిస్టమ్ ద్వారా స్టూడెంట్ కు నచ్చిన సబ్జెక్టును ఎంచుకునే విధానం తీసుకొచ్చాం. ఒక్కో స్టూడెంట్ ముందు 80 సబ్జెక్టులు పెట్టాం. దీనివల్ల బీఏ చదివే స్టూడెంట్ కెమిస్ట్రీ చదువుతున్నాడు. ప్రస్తుతం పీజీలోనూ ఏ డిగ్రీ చదివిన స్టూడెంట్ అయినా ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ చదివేలా మార్పులు తెస్తున్నం. 2022-– 23లో దీన్ని అమలు చేస్తాం. దీంతో బీటెక్ స్టూడెంట్​కూడా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ లాంటి కోర్సులు చదవొచ్చు. 
అడ్మిషన్లు లేని డిగ్రీ కాలేజీలను మూసేస్తున్నం 
రాష్ట్రంలో 1,065 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 187 సర్కార్, మిగిలినవన్నీ ప్రైవేటువే. ప్రైవేటు కాలేజీల్లో కొన్ని గుర్తింపు పొందుతున్నా, అడ్మిషన్లు తీసుకోవట్లేదు. కాబట్టి మూడేండ్ల నుంచి జీరో అడ్మిషన్లున్న 54 కాలేజీలకు నోటీసులు ఇచ్చి, మూసివేయాలని వీసీలకు సూచించాం. 15 మంది కంటే తక్కువ అడ్మిషన్లున్న కోర్సులనూ కన్వర్షన్ ​చేసుకోవాలని కాలేజీలకు చెప్పినం. ఇప్పటికే 130 కాలేజీల వరకూ అప్లై చేశాయి. తెలంగాణ వచ్చే టైమ్​కు 15–-16 సర్కారు కాలేజీలకు మాత్రమే న్యాక్ అక్రిడిటేషన్ ఉండే. ప్రస్తుతం 100 డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపు కలిగి ఉన్నాయి. గుర్తింపు లేని కాలేజీలకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. 
డిగ్రీలో ఫారిన్ కోర్సులు పెడుతున్నం
2022–23 అకడమిక్​లో డిగ్రీలో ఫారిన్ కోర్సులు పెట్టాలని నిర్ణయించాం. ప్రపంచంలో మెజార్టీగా మాట్లాడే భాషలను ఎంచుకున్నం. దీంట్లో భాగంగా చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, స్పానిష్ తదితర కోర్సులు ప్రారంభిస్తున్నం. ప్రస్తుతం హైదరాబాద్​లో అనేక ఫారిన్ కంపెనీలున్నాయి. వాటిల్లో నాలుగైదు భాషలు వచ్చినోళ్లకే ప్రయార్టీ ఇస్తున్నారు. అలాగే డిగ్రీలో ఫారిన్ లాంగ్వేజీ ఎంచుకున్నోళ్లు ఇతర దేశాలకు వెళ్తే కూడా లాభం జరుగుతుంది. 
ఇతర రాష్ట్రాల వాళ్లకు సీట్లు పెంచినం
గతంలో యూజీ, పీజీ కోర్సుల్లోని సీట్లలో నేషనల్ ఇంటిగ్రేషన్​ కోటా 5% ఉండేది. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారాలు, ఉద్యోగాల రీత్యా ఎక్కువ మంది హైదరాబాద్​లోనే సెటిలవుతున్నారు. దీనిపై విజ్ఞప్తులు రావడంతో ఆ కోటాను 20%కు పెంచాం. ఇవన్నీ సూపర్ న్యూమరీ సీట్లే. ఇప్పటికే ఇంటర్నేషనల్  స్టూడెంట్లు మన రాష్ట్రంలో చదివేందుకు వస్తే, ఎంతమందికైనా కేటాయించే అవకాశముంది. వీటిద్వారా ఇతర రాష్ట్రాలు, దేశాల స్టూడెంట్లు మన దగ్గర చదివేందుకు ఆసక్తి చూపిస్తారు.
ఈ ఏడాది నుంచి క్లస్టర్​ విధానం
నిరుడే క్లస్టర్ విధానం మొదలుపెట్టాలని అనుకున్నం. కానీ టెక్నికల్ కారణాలతో ఈ ఏడాది ప్రారంభిస్తున్నాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. ఇప్పటికే ఓయూ పరిధిలోని 10 అటానమస్ కాలేజీలు ఎంపిక చేశాం. 
1800 టీచింగ్ పోస్టులు భర్తీ.. 
ఇప్పటికే వర్సిటీల్లో పోస్టుల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే 1800 టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నాం. వర్సిటీల్లో నాన్ టిచింగ్​ గ్రూప్​–4 కేడర్​ పరిధిలో 700కు పైగా పోస్టులు టీఎస్​పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. మహిళా వర్సిటీ లో ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభిస్తాం.  

 

 

మరిన్ని వార్తల కోసం

ఈ కేవైసీ అప్​డేట్​ కాక రైతుల పరేషాన్

అప్రూవల్ సరే.. పనులు ఎక్కడ?