అప్పుల భారతం.. భారీగా పెరిగిన రాష్ట్రాల అప్పులు

అప్పుల భారతం.. భారీగా పెరిగిన రాష్ట్రాల అప్పులు

భారతావని అప్పుల్లో కూరుకుపోతోంది. ఈ భారం పెద్దకొండలా మారుతోంది. వివిధ రాష్ట్రాల అప్పులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఆర్థిక లోటు పూడ్చుకోవడానికి, అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు కేంద్రం, రాష్ట్రాలు అప్పులు చేస్తూ ఉంటాయి.

 అప్పులు దేశ ఆర్థికవ్యవస్థలో ప్రధాన అంశంకాగా భారత దేశంలోనే కాకుండా ఏ దేశంలో అయినా ఇది సహజ ప్రక్రియే. కేంద్ర ప్రభుత్వం చేసే అప్పులు స్వదేశీ (అంతర్గత), విదేశీ ( బాహ్య ) అని రెండు రకాలుగా ఉంటాయి. వీటి ఆధారంగానే దేశ రుణభారాన్ని అంచనా వేసే అవకాశం కలుగుతుంది. దేశీయ అప్పుల్లో ఎక్కువభాగం దేశీయ మార్కెట్ నుంచి తీసుకుంటారు. 

2024-– 25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రకారం దేశ అంతర్గత అప్పు సుమారు రూ.168 లక్షల కోట్ల వరకూ ఉందని అంచనా.  ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియన్ డెవలప్​మెంట్ బ్యాంకు, విదేశీ వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను విదేశీ అప్పులుగా పరిగణిస్తారు. 

ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2024 డిసెంబర్ నాటికి భారత విదేశీ అప్పు దాదాపు 54 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అంతర్గత, బాహ్య అప్పులను కలిపితే భారతదేశ మొత్తం అప్పు 2024- – 25లో సుమారు రూ.212 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. ఇది దేశ జీడీపీలో 55 నుంచి 60శాతం మధ్యలో ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

దేశ జనాభా సుమారు 142 కోట్లుగా పరిగణిస్తే ఒక్కో వ్యక్తిపై సగటు అప్పు దాదాపు రూ.1.44 లక్షల  నుంచి రూ.1.48 లక్షల  వరకూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ లోని రూపాయి విలువతోపాటు వివిధ అంశాల ఆధారంగా ఈ లెక్కలు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

రాష్ట్రాల అప్పులు సైతం భారీగా పెరిగాయి!

కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు కూడా గణనీయంగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్రాల మొత్తం అప్పు దాదాపు రూ.83.3 లక్షల కోట్లని రిజర్వు బ్యాంకు తెలిపింది. కానీ, ఆర్​బీఐ తెలిపిన రాష్ట్రాల  అప్పులు బడ్జెట్​ అప్పులు మాత్రమే. ఆయా రాష్ట్రాలు కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులు దానికి అదనం అని గమనించాలి.  

కాబట్టి  ఆయా రాష్ట్రాల బడ్జెట్​ పరిధి అప్పులను మాత్రమే పరిగణించి చూస్తే.. దేశీయ ఉత్పత్తిలో పంజాబ్ అగ్రస్థానంలో ఉండగా చివరి స్థానంలో ఒడిశా రాష్ట్రం ఉంది. పంజాబ్ 46.6 శాతం, హిమాచల్ ప్రదేశ్ 45.2, పశ్చిమ బెంగాల్ 38.0, బిహార్ 37.3, కేరళ 36.8, రాజస్థాన్ 35.8, ఉత్తర ప్రదేశ్ 31.8, మధ్య ప్రదేశ్ 31.6, హర్యానా 30.4, తమిళనాడు 30.3, కర్ణాటక 26.5, మహారాష్ట్ర 19.0, గుజరాత్ 17.9,  ఒడిశా 16.3 శాతం మేర అప్పులు తీసుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్ సభలో వివరాలు ప్రకటించింది.

అప్పుల ప్రభావం పేదలపైనే అధికం!

అప్పులు పెరగటం వల్ల పన్నులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది సామాన్యుల జీవన వ్యయాన్ని పెంచుతుంది. వివిధ రకాల భారాలకు అప్పు మూల కారణం అవుతుంది. ఫలితంగా సామాన్య ప్రజల మీదే భారం పడుతుంది. 

గత పదేళ్లలో మొత్తం రుణాలు రూ. 82.74 లక్షల కోట్ల నుంచి రూ.207.86 లక్షల కోట్లకు పెరిగాయి.151 శాతం పెరుగుదల కనిపిస్తోంది. అధిక అప్పుల కారణంగా ఎక్కువ శాతం మంది జీవన విధానం కుదేలవుతోంది. అప్పుల భారం ధనవంతుల కన్నా పేదలు, మధ్యతరగతిపైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. 

–జి. యోగేశ్వరరావు, సీనియర్​జర్నలిస్ట్​–