
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ కమిటీలు కీలకపాత్ర పోషించేవిధంగా రాజ్యాంగంలోనే రచన జరిగింది. కమిటీలు వివిధ శాసన, పరిపాలన, పర్యవేక్షణ విధులను నిర్వహించడానికి, జవాబుదారీతనం పెంచడానికి ఏర్పాటుచేశారు. ఈ కమిటీలు శాసన, పాలన ప్రక్రియలు సమగ్రంగా, పారదర్శకంగా, వివక్షరహితంగా ఉండేలా చూస్తాయి. సంక్లిష్ట సమస్యలకు అవి ఒక వేదికను అందిస్తాయి.
భారతదేశ రాజ్యాంగం అమలుకు, సమతుల్య సామాజిక-ఆర్థిక ప్రగతి సాధించటానికి అనేక ఏళ్లుగా వివిధ కమిటీలు, కమిషన్లు తమవంతు పాత్ర నిర్వహించాయి. విస్తృతమైన సమస్యలపై సిఫార్సులు అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెసులుబాటుకు ఈ రకమైన ప్రక్రియను రాజ్యాంగ రచయితలు నిర్వచించారు.
పాలన సంస్కరణలు, ఆర్థిక విధానాల సమీక్ష, సామాజిక న్యాయం, విద్యలో పురోగతి సాధించటానికి మేధోసంపత్తిని ఉపయోగించే వ్యవస్థలో ఈ కమిటీలు కీలకం. ఇప్పటికే ఉన్న వ్యవస్థలను సమీక్షించడం, విశ్లేషించడంలో క్లిష్టమైన పాత్ర పోషించాయి కొన్ని కమిటీలు. నిపుణుల అభిప్రాయం ఆధారంగా మార్పులను ప్రతిపాదించారు.శాసన, విధాన సంస్కరణలకు మార్గనిర్దేశం చేశారు.
ఈ కమిటీలను ఒక విస్తృతార్థంలో గమనిస్తే ప్రభుత్వ సంస్థలను నడిపించే పాలక కమిటీలు కూడా ఈ కోవలోకి వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, బోర్డులు, వగైరాతోపాటు రాజ్యాంగ సంస్థలు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర సంస్థల నిర్వహణకు పాలక కమిటీలు ఉంటాయి. వీటిలో నియామకాలు కూడా పరిశీలించాల్సినవే. కమిటీలు సంస్థలో భాగంగా చూస్తారు.
కానీ, కమిటీలు ఒకోసారి సంస్థలుగా పాత్ర పోషిస్తున్న వైనం గమనంలోకి తీసుకోరు. కంపెనీలు, సహకార సంస్థలు, కార్పొరేషన్లు, కమిషన్ల మాదిరే కొన్ని కమిటీలు కూడా నిర్ణయాత్మక, గుణాత్మక మార్పుకు పని చేస్తాయి.వాటిని సంస్థలుగా పరిగణించకపోవడం ఒక విధంగా మంచిదే అయినా జరుగుతున్న మార్పుల వల్ల వాటిని నిశితంగా పరిశీలించకపోవటం వల్ల అనర్థాలు కూడా జరుగుతున్నాయి. కమిటీల పనితీరు రాజకీయం అవుతున్నది. శాస్త్రీయత కొరవడుతున్నది.
నిబంధనలు, పారదర్శక పాలనపై నిఘా
భారత శాసన వ్యవస్థలో కమిటీల ఏర్పాటుకు కొన్ని ముఖ్యమైన నిబంధనలు, చట్టపరమైన దిశానిర్దేశకాలు ఉన్నాయి. మొదటిది, రాజ్యాంగ ప్రాతిపదిక. ఆర్టికల్ 263 ద్వారా సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వ సంఘాల ఏర్పాటుకు అనుమతి ఉన్నది. ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) ఏర్పాటుకు రాజ్యాంగపరంగా అనుమతి ఉన్నది. రాజ్యాంగానికి 73వ, 74వ సవరణల మేరకు స్థానిక పరిపాలన కమిటీల ఏర్పాటుకు చట్టబద్ధత ఏర్పడింది.
ఈ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. రెండవది, చట్టసభల పనిలో భాగంగా ఏర్పాటు చేసే కమిటీలు. పార్లమెంటుఆలో స్టాండింగ్ కమిటీల నియమావళి ఉన్నది. ప్రతి బిల్లు లేదా విధానాన్ని లేదా అంతర్జాతీయ ఒప్పందాన్ని ఒక కమిటీకి నివేదించవచ్చు. ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేయవచ్చు. డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీల ద్వారా 24 కేంద్ర మంత్రిత్వ శాఖల పని తీరును ఆయా కమిటీలు సమీక్షిస్తున్నాయి. ఈ కమిటీలలో దాదాపు అన్ని రాజకీయ పక్షాలకు సభ్యత్వం ఉంటుంది. ప్రజాస్వామ్య దేశాలలో శాసన, చట్టసభలు కమిటీల ద్వారా పనిచేస్తున్నాయి.
కమిటీల సిఫారసులకు రాజ్యాంగ బలం
శాసనసభలలో కూడా కమిటీలకు ఆస్కారం ఉన్నా, దాదాపు అన్ని రాష్ట్రాలలో ఇవి పని చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో గత పదేండ్లలో ఒక్క కమిటీ కూడా పూర్తిస్థాయిలో పని చేయలేదు. ప్రజలు శాసనసభ దృష్టికి తమ సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం పిటీషన్స్ కమిటీ ద్వారా ఉన్నది. ప్రభుత్వ పథకాలు, ఖర్చు, జమ, శాఖల పనితీరు మీద సమీక్షించే పద్దుల కమిటీని నీరుగార్చారు.
ఈ కమిటీలు ఏర్పాటు చేస్తే పాలన పారదర్శకంగా ఉంటుంది. ఈ కమిటీల సిఫారసులకు రాజ్యాంగబలం ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని పక్కనబెట్టి నియోజకవర్గాలలో శాసనసభ్యులకు కార్యాలయాలు, సిబ్బంది ఏర్పాటుచేసి పాలనలో వారికి వ్యక్తిగత నిర్ణయాధికారం పెంచింది. ఈ తరహా జోక్యం వల్ల వ్యక్తిగత లాభం ఎక్కువ, ప్రజా ప్రయోజనం తక్కువ.
ఏడాదికి పైగా పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మిన్నకుండిపోయింది. మూడవది, నిపుణుల కమిటీలు. ప్రభుత్వాలు గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నియమించే నిపుణుల కమిటీలు రాజ్యాంగ చట్టానికి లోబడి లేకపోయినా, వాటి నివేదికలు విధాన రూపకల్పనపై ప్రభావం చూపుతాయి.
ఇదివరకు ఈ కమిటీల కూర్పు, వాటి పనితీరు, నివేదికలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆయా నిపుణుల కమిటీలు చాలా లోతుగా పరిశీలించి, తగిన సిఫారసులు సూచనలు ఇచ్చే సత్సంప్రదాయం ఉంది.
కొన్ని ఉదాహరణలు: ఆర్థిక రంగం: నరసింహం కమిటీ I & II (1991, 1998): బ్యాంకింగ్ సంస్కరణలకు మూల స్తంభాలుగా నిలిచాయి. కేల్కర్ కమిటీ (2002): పన్నుల సరళీకరణకు తోడ్పడినప్పటికీ కార్పొరేట్ కంపెనీలకు మద్దతు అధికం. సామాజిక రంగం – విద్య, ఆరోగ్యం: కస్తూరీరంగన్ కమిటీ (NEP 2020): 5+3+3+4 విధానం.
హై లెవెల్ ఎక్స్పర్ట్ గ్రూప్ (NHP 2017): యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లక్ష్యంగా సూచనలు.
మౌలిక హక్కులు & డేటా: శ్రీకృష్ణ కమిటీ (2018): Data Protection Authority కోసం రూపకల్పన. కేంద్ర, -రాష్ట్ర సంబంధాలు: సర్కారియా కమిటీ, పుంచీ కమిటీ (2007) న్యాయరంగం: మాలిమాథ్ కమిటీ (2003): న్యాయవ్యవస్థ సత్వర స్పందనకు మార్గాలు.
అనుమతుల ప్రక్రియకు కమిటీలు
మంత్రిత్వశాఖలు కూడా తమ విధులలో భాగంగా, అనుమతుల ప్రక్రియలలో కమిటీలు ఏర్పాటు చేస్తుంటాయి. కొన్ని కమిటీలలో విషయజ్ఞానులు, నిపుణుల అవసరం ఉంటుంది. అనేక సందర్భాలలో విషయ నిపుణులు దొరకని పరిస్థితులలో ఎవరో ఒకరిని నియమిస్తున్నారు. ఫలితంగా, ఆ కమిటీ పనితీరు, నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉంటున్నాయి.
కొన్ని కమిటీల ఎంపికలో పారదర్శకత లోపం, సిఫార్సులపై చర్యల లోపం, పౌర సమీక్ష లేకపోవడం, మమ కమిటీలు ఎక్కువైపోయాయి. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఇచ్చే అటవీ, పర్యావరణ అనుమతులకు ఆయా కమిటీల సిఫారసులు కీలకం. ప్రతి మూడు ఏండ్లకు ఒకసారి నియమించే ఈ కమిటీల సభ్యత్వం రానురాను మసకబారుతున్నది. ఒక ప్రాజెక్టు పరిశీలనకు అవసరమైన నైపుణ్యం లేనివాళ్ళు ఈ కమిటీలలో సభ్యత్వం పొంది అనుమతుల ప్రక్రియలలో ఉండాల్సిన ‘శాస్త్రీయత’ను నీరుగార్చి అంతిమంగా ప్రజా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు.
కమిటీల స్థానంలోప్రైవేట్ కన్సల్టెన్సీలు వచ్చాయ్..!
అభివృద్ధి రచన ప్రక్రియలో ప్రజల భాగస్వామ్యం కొరవడింది. ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ నినాదం ఇవ్వడం పరిపాటి అయిపోయింది. ఇండియా రైజింగ్, బంగారు తెలంగాణ, తెలంగాణ రైజింగ్ అంటూ నినాదం ఇవ్వడం, ఆనక దాని గురించి ప్రణాళిక తయారు చేయడానికి ప్రైవేటు కంపెనీలకు నిధులు ఇవ్వడం. వారు ఏదో ఒక నివేదిక తయారు చేసి ఇస్తే, దానిని ప్రభుత్వం కనీస సమీక్ష లేకుండా ఆమోదించి, ప్రజల మీద రుద్దడం ఒక పాలనాపర ప్రక్రియగా మారింది.
ప్రణాళికాబద్ధ అభివృద్ధికి, స్థానిక పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుని లోతుగా పరిశీలించాల్సిన అనేక పాలనాపర, విధానపర, నిర్ణయాత్మక అంశాల మీద అధ్యయన కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా, ప్రైవేటు కన్సల్టెంట్‌కు అప్పజెప్పడం మంచిది కాదు.
మార్గదర్శకాలు ఉండాలి
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన ‘ఉంటా’ (umta) సంస్థలో పౌరుల సభ్యత్వంతో పూర్తి చేసి, బలోపేతం చేస్తే ఫలితాలు వస్తాయి. మూసీ పునరుజ్జీవన కమిటీ ఏర్పాటుచేసి వివిధ విషయ సంబంధ నిపుణులను చేర్చి, ప్రైవేటు కన్సల్టెంట్ తయారుచేస్తున్న నివేదికను పరిశీలింపజేస్తే, ఒక అర్థవంతమైన ప్రణాళిక తయారుచేసే అవకాశం కల్పించినట్లవుతుంది.
కమిటీలకు, కమిటీలలో సభ్యత్వానికి సంబంధించి కొన్ని విధి విధానాల తయారీకి కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి. కమిటీల ఏర్పాటుకు అవలంబించాల్సిన సూత్రాలు, పద్ధతులకు సంబంధించి మార్గదర్శకాలు తయారుచేయాలి. ప్రజాస్వామ్యంలో ఈ కమిటీలను నిజంగా ప్రజల ధ్వనిగా నిలబెట్టాలంటే, వాటిపై సమీక్ష అవసరం. విధానపూర్వక నిబంధనల పునర్విశ్లేషణ కూడా అవసరం.
-డా. దొంతి నరసింహారెడ్డి,పాలసీ ఎనలిస్ట్–