యాది మరువలేని నేత మన సంజీవయ్య‌

యాది మరువలేని నేత మన సంజీవయ్య‌

దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి, రెండు సార్లు కేంద్ర మంత్రి (పరిశ్రమలు, కార్మిక శాఖలు), రెండుసార్లు – అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొదలుకొని, ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో దాదాపు 20 ఏళ్లుగా వివిధ శాఖల్లో మంత్రిగా పని చేసిన గొప్ప రాజకీయవేత్త, అపార అనుభవశీలి, స్నేహశీలి, సౌమ్యుడు, సాహితీవేత్త, ఆదర్శప్రాయుడు, చిరస్మరణీయుడు మనదామోదరం సంజీవయ్య. చదువుకోవటానికి ఏ మాత్రం అవకాశాలు లేని నిరుపేద కుటుంబంలో పుట్టి పట్టుదలే పెట్టుబడిగా ‘లా’ డిగ్రీ సాధించిన అనన్యుడు. కర్నూలు టౌన్ కు సమీపంలోని పెదపాడులో జన్మించారు. తల్లి సుంకలమ్మ, తండ్రి మొనయ్య, ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబంలో చివరి సంతానం సంజీవయ్య. పుట్టిన మూడోరోజే తండ్రి చనిపోవడంతో పక్కనే ఉన్న ప్యాలకుర్తి గ్రామంలో మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడే అక్షరాభ్యాసం జరిగింది. మూడేళ్ల తర్వాత సొంతూరికి వచ్చారు, కర్నూలులో ఎస్ఎస్ఎల్సీ (టెన్త్), అనంతపురంలో బీఏ పూర్తిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పెద్దల ఆశీస్సులతో,పెద్ద నేతల అండదండలతో, 1950లో ప్రొవిజనల్ పార్లమెంటు మెంబర్ గా, 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికల్లో అవిభక్త మద్రాసు రాష్ట్రం నుంచి
ఎన్నికై, రాజనీతిజ్ఞుడైన చక్రవర్తి రాజగోపాలాచారి మెప్పు పొంది ఆయన కేబినెట్ లో మంత్రిగా పని చేశారు.

కర్నూలులో టంగుటూరి ప్రకాశం పంతులు, తర్వాత బెజవాడ గోపాలరెడ్డి కేబినెట్ లో, ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్ రాజధానిగా నీలం సంజీవరెడ్డికేబినెట్ లో పలు శాఖలు చేపట్టి సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. 1960లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడి దేశ చరిత్రలోనే తనకొక విశిష్టత సంతరించుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన వయసు 39 ఏళ్లే. లేరాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పదేళ్ల‌కే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు సంజీవయ్య. పెద్దకులాల నాయకులు కొందరు ఆయన్ను ఆ పదవిలో పూర్తికాలం కొనసాగనివ్వలేదు. 27 నెలలకే పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ అనతికాలంలోనే ముఖ్యమంత్రిగా సంజీవయ్య అనేక వెల్ఫేర్ స్కీమ్స్ అమలుకు నాం దిపలికారు. భూమిలేని నిరుపేదలకు ఆరు లక్షల ఎకరాల బంజరు భూముల పంపిణీ, వృద్ధులకు పెన్షన్లు, బాలికలకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించేందుకు హైదరాబాద్ ఎగ్జిబిగ్జి షన్ సొసైటీ ఆధ్వర్యంలో దేశంలోనే మొదటి సారి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ ను ఏర్పాటు చేశారు. చర్మకారుల కోసం లిడ్ క్యాప్, పారిశ్రామిక అభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ), చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్ఐడీసీ), మైనింగ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) వంటివి మచ్చుకు కొన్ని ఆయన దూరదృష్టికి నిదర్శనం.

కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ ఏర్పాటుతో యాజమాన్యాలు, ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ సమస్యలను పరిష్కరించే దిశగా సంజీవయ్య చేసిన కృషి ఎనలేనిది, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి సాంఘిక న్యాయానికి బాట వేశారు. షెడ్యూల్డ్ కులాలు, జాతులకు 14 శాతం నుంచి 17 శాతానికి, వెనుకబడిన తరగతుల వారికి 24 శాతం నుంచి 38 శాతం రిజర్వేషన్లు పెంచుతూ తీసుకున్న నిర్ణ‌యం ఆ రోజుల్లో దేశంలోనే సంచలనం. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మిక, యాజమాన్యాల మిత్రుడిగా పేరు తెచ్చుకున్నారు. ఈయనకు బోనస్ సంజీవయ్యగా గుర్తింపు ఉండేది. 45 లక్షల మంది కార్మికులకు కనీస బోనస్ అందేలా చట్టం తెచ్చారు. రాజకీయాల్లో నెగ్గుతూ వచ్చిన సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు సంజీవయ్య. పద్యాలు, గేయాలు, పాటలు, స్తుతులు, కొన్ని నాటకాలు రాసి, వాటిలో నటించారు. అఖిల భారత తెలుగు రచయితల ప్రథమ మహాసభల్ని 1960 మే 6న హైదరాబాద్ లో నిర్వహించిన గౌరవం ముఖ్య మంత్రి సంజీవయ్యకే దక్కుతుంది. ఢిల్లీలో సాహితీ చర్చలు జరుపుకోవడానికి తెలుగు సాహితీ సంస్థ ఏర్పాటుకు సంజీవయ్య ఆద్యులు. ఉమ్మడి మద్రాసులో మంత్రిగా ఉన్నరోజుల్లోసుప్రసిద్ధకవి బోయిభీమన్న తన మొదటి కావ్యం ‘మధుగీత’ను సంజీవయ్యకు అంకితమిచ్చాడు. ఓ ఆత్మీయ విందులో తన పెళ్లి గురించి చెబుతూ ‘ఇది నాకు రెండో పెళ్లి. నా మొదటి పెళ్లి బోయి భీమన్న ‘మధుబాలస‌తో అని చమత్కరించారు. సంజీవయ్య సాహితీ మిత్రుల్లోరావూరి భరద్వాజ ఒకరు. లలిత కళాఅకాడమీతో పాటు సాహిత్య, సంగీత అకాడమీలు ఆయన మానస పుత్రికలే.

నిజాయితీకి నిలువుటద్దం సంజీవయ్య. కర్నూలు జిల్లాకు చెందిన కె.ఈ, మాదన్న (నేటి కేఈకృష్ణమూర్తి తండ్రి) సంజీవయ్యకు బెస్ట్ ఫ్రెండ్. అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సమయం అది. సంజీవయ్య వద్ద ప్రచారానికి డబ్బు లేదు. ఆ సమయానికి మాదన్నఫేమస్ ప్రొడ్యూసర్. ఆయన ఒక ఆఫర్ ఇచ్చారు. తన సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇస్తే ఎన్నికల ఖర్చు భరిస్తానన్నారు. ‘నన్ను అమ్మవద్దు, నా జీవితం పాడు చేయవద్దుస‌ అని సంజీవయ్య బదులివ్వడం ఆయన నిజాయితీకి నిదర్శనం. రాజకీయాల్లోరాణించడానికి సంజీవయ్య ఏనాడూ అడ్డదార్లు తొక్కలేదు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక సెంటు భూమి, సొంత కారు, బ్యాంకు బ్యాలెన్స్ లేని నిరాడంబర జీవి ఆయన.కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలోనే ఏఐసీసీ మీటింగ్ లో కాంగ్రెస్ హయాంలో ధనికులు ఎక్కువ ధనికులు, పేదలు పేదలుగా ఉండిపోతున్నారని నిర్భయంగా చెప్పారు. 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోసంజీవయ్య కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడాయన కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. నమ్మిన మిత్రులు మోసం చేశారన్న వినికిడి. ఎన్నికల ప్రచారసభలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికిగురైంది. గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఓటమి, యాక్సిడెంట్ దిగులు నుంచి చాలాకాలం కోలుకోలేకపోయారు. కర్నూలు ఎన్నికల రిజల్ట్ రాగానే కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేశారు. కొంతకాలం ఏ పదవీ లేకుండానే ఢిల్లీలో ఉండి పార్టీ వ్యవహారాలు చూసేవారు. 1971లో రెండోసారి కాంగ్రెస్ ప్రెసి
డెంట్ గా ఉన్నప్పుడే ఆయన సారథ్యంలో సాధారణ ఎన్నికల జరిగాయి.1972 మే 7వ తేదీన రాత్రి ఆకస్మికంగా సంజీవయ్య ఢిల్లీలో కన్నుమూశారు. పాటిగడ్డలోని నేటి సంజీవయ్య పార్కులో జరిగిన అంత్యక్రియలతో జీవనయాత్ర చాలించిన ఆయన మనందరి స్మృతి పథంలో ఎప్పుడూ మెదులుతుంటారు.– డా.శ్రీనివాసులు దాసరి, ఐఎఎస్, రిటైర్డ్