విజయ్ రాజకీయం మామూలుగా లేదుగా : అన్నాడీఎంకే చీఫ్ తో ఆప్త మిత్రుడు భేటీ

విజయ్ రాజకీయం మామూలుగా లేదుగా : అన్నాడీఎంకే చీఫ్ తో ఆప్త మిత్రుడు భేటీ

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామాలు. అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకే పార్టీ వేస్తున్న అడుగులు ఊహకు అందని విధంగా ఉన్నాయి. విజయ్ రాజకీయం మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు సిసలు రాజకీయం ఇప్పుడు చూపిస్తున్నాడు అనే  మాటలు రాజకీయ వర్గాల నుంచే వినిపించటం విశేషం. 

అధికారంలోకి రావటం జస్ట్ 10 అంటే 10 సీట్లు కావాల్సి ఉంది. ఇలాంటి టైంలో నిన్నటి వరకు చిన్నా చితక పార్టీతో రాయబారం నడిపిన విజయ్.. ఇప్పుడు ఏకంగా అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పళనిస్వామితో టచ్ లోకి వెళ్లారు. 2026, మే 6వ తేదీ బుధవారం ఉదయం.. విజయ్ ఆప్తమిత్రుడు, సలహాదారుడు అయిన ఆనంద్.. మాజీ సీఎం, అన్నాడీఎంకే పార్టీ చీఫ్ పళనిస్వామి ఇంటికి వెళ్లారు. ఆయనతో వన్ టూ వన్ మీటింగ్ పెట్టారు. 

నిన్నామొన్నటి వరకు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీల మద్దతుతో అధికారంలోకి వస్తున్నాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించిన టీవీకే పార్టీ.. ఇప్పుడు అన్నా డీఎంకే పార్టీతో చర్చలు జరపటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అన్నాడీఎంకే పార్టీ.. బీజేపీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. బీజేపీ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో అన్నాడీఎంకే పార్టీ ఒంటరిగా 47 సీట్లు గెలిచింది. ఆ పార్టీలో ఇప్పటికే ముసలం మొదలైంది. షణ్ముగం ఆధ్వర్యంలో సగం మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వటానికి రెడీ అయిపోయారు. 

ఇలాంటి పరిణామాల క్రమంలో.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఇంటికి.. విజయ్ ఆప్తమిత్రుడు ఆనంద్ రావటం.. వన్ టూ వన్ డిస్కషన్ చేయటం ఊహించని మలుపుగా చెబుతున్నాయి రాజకీయ వర్గాలు.

కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి చిన్నాచితక పార్టీల మద్దతు కంటే.. ఏకంగా 47 మంది ఎమ్మెల్యేల బలంతో.. మూడో స్థానంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మద్దతు తీసుకుంటే బెటర్ అనే ఆలోచన విజయ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీకి సైతం ఇది జీవన్మరణ సమస్య. ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే పార్టీ ఉంది.. ఇప్పుడు అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా లేదు ఆ పార్టీ. వచ్చే ఎన్నికల వరకు పార్టీ మనుగడ సాధించాలంటే.. టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చి.. ప్రత్యక్షంగా.. పరోక్షంగా  అధికారంలో ఉంటే బెటర్ అనే ఆలోచన అన్నాడీఎంకే పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. 

ఒక వేళ అన్నాడీఎంకే పార్టీ హైకమాండ్ నిర్ణయం మరోలా ఉంటే.. అన్నాడీఎంకేలోని కనీసం 20 మంది ఎమ్మెల్యేలు చీలిపోయి.. విజయ్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ పరిణామాలు అన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 

విజయ్ సైతం.. అనుభవం ఉన్న రాజకీయ నాయకుడి మాదిరిగా ఆలోచించటం.. ఎత్తులకు పైఎత్తులు వేయటం.. ఆయా పార్టీల బలాలు, బలహీనతల ఆసరగా చర్చలు జరపటం అనేది చూస్తుంటే.. విజయ్ మామూలోడు కాదుగా అంటున్నారు తమిళనాడు రాజకీయ నేతలు.