ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లోని గ్రాండిస్ జొరాసెస్ అనే కొండపై ఉన్న ప్లాన్పినిసియక్స్ గ్లేసియర్ ప్రమాదపుటంచున ఉందని ఇటాలియన్ నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ హెచ్చరించింది. 90 లక్షల క్యూబిక్ ఫీట్ల మందం ఉన్న ఆ గ్లేసియర్ మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. 2013 నుంచి ఆ గ్లేసియర్ (హిమనీనదం)ను కౌన్సిల్‌కు చెందిన డేనియల్ గోర్డాన్ టీం పరిశీలిస్తోంది. ఏటా ఎండాకాలంలో గ్లేసియర్‌కు పగుళ్లు రావడం సహజమే అయినా, ఈ ఏడాది ఆ పగులు చాలా పెద్దగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈ ఏడాది పెద్ద పగులును మేం చూశాం. దాని వల్ల ఆ భాగం మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. ఆ బ్లాక్ మొత్తం లోయ అడుగు భాగానికి పడిపోతుంది. అవలాంచ్లా ముంచేస్తుంది. దాని వల్ల ఆ లోయలోని జనాలకు, ట్రెక్కింగ్ చేసే వాళ్లకు పెద్ద ముప్పులా మారుతుంది. రోడ్లను బ్లాక్ చేస్తుంది” అని గోర్డాన్ చెప్పారు.
ట్రెక్కింగ్ కోసం అక్కడకు చాలా మంది వస్తుంటారని, ఈ ముప్పు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కోర్మేయర్ పట్టణ మేయర్ చెప్పారు. ట్రెక్కింగ్ రాకుండా ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, కొండెక్కిన వారిని కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రోడ్లను ఎక్కడికక్కడ బ్లాక్ చేసినట్టు వివరించారు. ముప్పు తీవ్రత ఎక్కువగానే ఉన్నా, అది ఎప్పుడు కూలిపోయేది మాత్రం సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు. దాన్ని డిసైడ్ చేసేది టెంపరేచర్లేనని గోర్డాన్ అంటున్నారు. అక్టోబర్‌లో చలి వాతావరణం ఉంటుంది కాబట్టి పగులు పూడుకుపోయే అవకాశం ఉందని, కానీ, ఆ పగులు చాలా పెద్దదిగా ఉండడమే ఆందోళన కలిగిస్తోందని వివరించారు. దీనికి వాతావరణ మార్పులతో డైరెక్ట్ సంబంధం లేకపోయినా, పెరుగుతున్న టెంపరేచర్లు మాత్రం కారణమవుతున్నాయని చెప్పారు. ఈ మధ్యే స్విట్జర్లాండ్ ఆల్ప్స్‌లోని పిజోల్ గ్లేసియర్ పూర్తిగా కనుమరుగైంది. దానికి అంత్యక్రియలు కూడా చేశారు అక్కడి జనం.
