సిటీలో ప్రమాదకరంగా హోర్డింగ్ ఫ్రేమ్స్

 సిటీలో ప్రమాదకరంగా హోర్డింగ్ ఫ్రేమ్స్

హైదరాబాద్, వెలుగు:జీహెచ్ఎంసీకి ఒకప్పడు భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టిన హోర్డింగ్స్ ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. మూడేండ్లుగా వాటిపై నిషేధం కొనసాగుతుండడంతో హోర్డింగ్ ఏజెన్సీలు కొత్తవి ఏర్పాటు చేయట్లేదు. కానీ నిషేధానికి ముందున్న వాటికి ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి. గతంలో బంజారాహిల్స్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో హోర్డింగ్స్​కూలి కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జీహెచ్ఎంసీ హోర్డింగ్స్​ను బ్యాన్ చేసింది. అప్పటి నుంచి బిల్డింగ్స్ పై అలానే ఉన్న ఫ్రేమ్స్​ తుప్పు పట్టి కూలుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున కురిసిన ఈదురుగాలుల వానకు శివారులోని అబ్దుల్లాపూర్ మెట్​లో ఓ ఇంటిపై ఉన్న   హోర్డింగ్ ఫ్రేమ్​తో సహా కుప్పకూలింది. ఇదే ప్రమాదం సిటీలో జరిగి ఉంటే చాలా నష్టం జరిగి ఉండేది. వచ్చేది వానాకాలం కావడంతో జనం ఆందోళన చెందుతున్నారు. బిల్డింగ్స్ పై ఉన్నవాటిని తొలగించాలని కోరుతున్నారు. తాము తొలగించాలని చూసినప్పటికీ హోర్డింగ్ ఏజెన్సీలు కోర్టుకి వెళ్లడంతో ఫ్రేమ్స్​తొలగింపు ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిందని బల్దియా ఆఫీసర్లు చెబుతున్నారు. హోర్డింగ్​ఏజెన్సీలదే వాటి బాధ్యత అంటున్నారు. కోట్లు ఖర్చుచేసి ఏర్పాటు చేశాక.. బ్యాన్ ​చేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నాయని హోర్డింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. హోర్డింగ్ ​అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు జరిగాయి. కానీ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించట్లేదు. కోర్టు విచారణకు బల్దియా సహకరించకపోవడంతోనే హోర్డింగ్స్​ విషయం పెండింగ్​లో పడుతున్నట్లు సమాచారం.

ఫైన్లతోనే సరి..అనుమతి లేకుండా ఏర్పాటు 

చేస్తున్న ఫ్లెక్సీలు, హోర్డింగ్​లపై భారీ ఫైన్లు వేసి బల్దియా చేతులు దులుపుకుంటోంది. కానీ జనం భద్రతను పట్టించుకోవడంలేదు. రద్దీ ఏరియాల్లో హోర్డింగ్స్, వాటికున్న ఫ్రేమ్స్​ కూలితే చాలా నష్టం జరిగే చాన్స్ ఉంది. పర్యావరణానికి హాని కలుగుతుందని ఫ్లెక్సీలను అనుమతించని బల్దియా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవడం లేదు. అధికారులు స్పందించి వెంటనే వీటిని తొలగించాలని జనం కోరుతున్నారు. బల్దియాపరిధిలో ఫ్లెక్సీలు, హోర్డింగ్​లపై నిషేధం ఉన్నప్పటికీ శివారు మున్సిపాలిటీల్లో విచ్చలవిడిగా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఏజెన్సీలు, పట్టించుకునేవారు లేకపోవడంతో ఎవరి ఇంటిపై వారు ఇష్టానుసారంగా పెట్టుకుంటున్నారు. జీహెచ్ఎంసీ మాదిరిగా పక్క కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎందుకు నిషేధం అమలు చేయడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు.  

కోర్టు తీర్పు తర్వాత చర్చిస్తాం

హోర్డింగ్స్ అంశం కోర్టులో ఉందని, అందుకే వాటికున్న ఫ్రేమ్​లను తొలగించడం లేదని జీహెచ్ఎంసీ అడ్వర్టైజ్​మెంట్ ఆఫీసర్ కార్తీక్ తెలిపారు. ఎక్కడైనా ప్రమాకరంగా ఉంటే వాటికి సంబంధించి ఆయా ఏజెన్సీలే చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. కోర్టు తీర్పు తర్వాత ఏం చేయాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గ్రేటర్ పరిధిలో ఎక్కడైనా హోర్డింగ్స్ ప్రమాదకరంగా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనాలకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. 

ఎందుకు తొలగించట్లే?

హోర్డింగ్స్ ​ఏర్పాటు చేయకుండా చేసిన బల్దియా ఆఫీసర్లు ఫ్రేమ్​లను ఎందుకు తొలగించట్లేదు. ఈ విషయం కొలిక్కి వచ్చేలా చూడాలె. ఈసారి ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిస్తే మరిన్ని హోర్డింగ్​లు కూలే అవకాశం ఉంది.
- జెన్నా సుధాకర్, సిటీ బీజేవైఎం లీడర్