డీఏపీ కోసం అదనపు ఎరువుల కొర్రీ.. ఇతర మందులు కూడా కొనాలని షరతులు

డీఏపీ కోసం అదనపు ఎరువుల కొర్రీ.. ఇతర మందులు కూడా కొనాలని షరతులు

ధర్మసాగర్, వెలుగు: ధర్మసాగర్ లోని గ్రోమోర్ ఎరువుల విక్రయ కేంద్రంలో డీఏపీ ఎరువులు కొనాలంటే ఇతర ఎరువులు కూడా కొనాల్సిందేనంటూ షరతులు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దేవునూర్ గ్రామానికి చెందిన రైతు కొంగంటి సందీప్ పత్తి పంట కోసం అవసరమైన డీఏపీ ఎరువులు కొనేందుకు ఈ నెల 8న గ్రోమోర్ సెంటర్‌‌‌‌కు వెళ్లాడు. 

మూడు బస్తాల డీఏపీ ఇవ్వాలని కోరగా, వాటితో పాటు ఎఫ్-20 ఎరువుల బస్తాలు కూడా కొనాలని సిబ్బంది షరతు పెట్టినట్లు ఆరోపించాడు. చేసేదేమీ లేక డీఏపీ తీసుకోకుండానే తిరిగి వచ్చినట్లు తెలిపాడు. దేవునూర్ గ్రామానికి చెందిన కొందరు రైతులు డీఏపీతో పాటు ఎఫ్-20 ఎరువులు కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. వాటి రశీదులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఈవోను వివరణ కోరగా, తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.