విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి జంటగా శశాంక్ శ్రీవాస్తవయ తెరకెక్కించిన చిత్రం ‘డార్క్ చాక్లెట్’. రానా దగ్గుబాటి సమర్పణలో స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. శనివారం ఈ మూవీ నుంచి ‘కల్లో కల్లోలం’ అనే పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ ‘సినిమాలో ఎంతో ప్రాధాన్యత గల పాట ఇది. వివేక్ సాగర్ అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు.
తప్పకుండా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది. ఇక ఇది చాలా కొత్త తరహా సినిమా. ప్రేక్షకులు దీని గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు’ అని చెప్పాడు. బిందు మాధవి మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత నాకు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ వచ్చింది. కానీ డైరెక్టర్ పర్ఫెక్షన్ వల్ల విడుదలకు ఆలస్యమైంది. యూఎస్ నుంచి వచ్చిన అమ్మాయిగా ఇందులో నటించా. దశాబ్ధం తర్వాత ఓ ఇంట్లో కాలేజ్ ఫ్రెండ్స్ కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మెయిన్ కాన్సెప్ట్. ప్రయోగాత్మక చిత్రాలను ప్రేక్షకులకు ఆదరిస్తున్న సమయంలో మా సినిమా రావడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ ‘కథంతా నిక్షిప్తమై ఉన్న ఈ పాటను నటుడు బాలాదిత్య చాలా బాగా రాశారు. అనురాగ్ కులకర్ణి అంతే అద్భుతంగా పాడారు. కొత్త రకం డార్క్ కామెడీ సినిమా ఇది’ అని చెప్పాడు. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, సింగర్ అనురాగ్ కులకర్ణి, నటులు రమేష్, రాకేష్, డైరెక్టర్ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
