ఇండ్ల పరిశీలనకు వెళ్తుంటే.. కేంద్ర మంత్రిని అరెస్టు చేసుడేంది?

 ఇండ్ల పరిశీలనకు వెళ్తుంటే.. కేంద్ర మంత్రిని అరెస్టు చేసుడేంది?
  • ఎంపీ ధర్మపురి అర్వింద్​ మండిపాటు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్ రెడ్డి అరెస్టును నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా ఖండించారు. ‘‘కేటీఆర్, కవిత పై ఉన్న ఆరోపణలు కిషన్ రెడ్డిపై లేవు కదా.. మరి అరెస్టు ఎందుకు చేశారు” అని ప్రశ్నించారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ సీనియర్ నేత ఎన్ ఇంద్రసేనారెడ్డితో కలిసి అర్వింద్​ మీడియాతో మాట్లాడారు. పేదల ఇండ్ల నిర్మాణంపై కేసీఆర్ కు చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇండ్లను పరిశీలించేందుకు వెళ్తున్న కిషన్ రెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. 

హౌసింగ్ డిపార్ట్ మెంట్ లో 1,821 మందికి 500 మంది మాత్రమే ఉద్యోగులు ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనుల పర్యవేక్షణ ఎలా సాగుతుందని నిలదీశారు. ‘‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల నిర్మాణాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. కానీ 18 వేల 500 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఖర్చు చేయలేదు” అని ఆయన మండిపడ్డారు. బీజేపీ అంటేనే కేసీఆర్ భయపడుతున్నారని  ఇంద్రసేనా రెడ్డి అన్నారు. పోలీసుల అనుమతి తీసుకున్నా.. బాట సింగారం వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.