ప్రభుత్వం క్షమాపణ చెప్పి అంబేద్కర్ విగ్రహం పెట్టాలి : శ్రవణ్

ప్రభుత్వం క్షమాపణ చెప్పి అంబేద్కర్ విగ్రహం పెట్టాలి : శ్రవణ్

హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ తొలగింపుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సీరియస్ గా స్పందించారు. పంజాగుట్టలో 9 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుపై 25 రోజుల ముందే  ప్రభుత్వానికి, GHMCకి జై భీమ్ సొసైటీ వాళ్లు దరఖాస్తు చేసుకున్నారని గుర్తుచేశారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహం ఆవిష్కరించి నివాళులు అర్పిస్తామని కోరినా… GHMC ఇన్నిరోజులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

విగ్రహాన్ని పెట్టుకున్న తర్వాత…విగ్రహం పెట్టిన వారిపై లాఠీఛార్జ్ చేసి అంబేద్కర్ విగ్రహాన్ని ముక్కలు.. ముక్కలు చేశారనీ… తీసుకెళ్లి జవహర్ నగర్ డంప్ యార్డ్ లో చెత్తకుప్పలో పడేశారని దాసోజ్ శ్రవణ్ చెప్పారు. ఇదేనా తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ కు ఇస్తున్న గౌరవం అని ప్రశ్నించారు. ప్రభుత్వం క్షమాపణలు చెప్పి సొంత ఖర్చులతో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు శ్రవణ్.

ఎస్సై, కానిస్టేబుల్స్ ఫిట్ నెస్ పరీక్షల్లో అక్రమాలు

“నిరుద్యోగులు జీవితాలను ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. 18 వేల 428 ఎస్.ఐ., కానిస్టేబుల్స్ ఖాళీల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది.  వీటికి సంబంధించిన అభ్యర్థుల దేహదారుడ్య(ఫిజికల్ ఫిట్ నెస్) పరీక్షల్లో లోపాలు జరిగాయి. ప్రభుత్వం ఆర్.ఎఫ్.ఐ.డి.ని వాడుతామని నోటిఫికేషన్ లో ఇవ్వలేదు. వేల మంది అర్హులై ఉండి కూడా ఆర్.ఎఫ్.ఐ.డి సిస్టం వల్ల నష్టపోయారు.  ఇది నిరుద్యోగులకు గుదిబండలా మారింది. ఎనిమిది మంది పరుగెత్తించాల్సిన చోట 40మందిని ఉంచి పరుగెత్తించారు. ప్రారంభంలో ఆర్.ఎఫ్.ఐ.డి సిస్టం ఏర్పాటు చేయలేదు. చివరలో పెట్టారు. ఇది కూడా అభ్యర్థులకు నష్టం కల్గించింది.  ఒకరికి బదులు మరొకరు పరుగుపందెంలో పాల్గొన్నారు. పోలీస్ పరీక్షలో ట్యాంపరింగ్ జరిగింది. 800మీటర్ల పరుగు పందెంలో అనేక అవకతవకలు జరిగాయి.

మార్చి 28, 29 నాడు అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే రమ్మన్నారు.. కానీ వచ్చాక వారితో మాట్లాడటానికి ఎవరూ లేరు. అవకతవకలపై లోతైన విచారణ జరిపించాలి. ఈ విషయంలో డీజీపీ, హోంమంత్రిని కలుస్తాం” అన్నారు దాసోజ్ శ్రవణ్.