
- అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- అసైన్డ్ కమిటీలకు గ్రీన్ సిగ్నల్
- భూదాన్ భూముల నిర్వహణకు కమిటీ
- త్వరలో భూముల విలువ సవరణ, స్టాంప్ డ్యూటీ తగ్గింపు
- శ్రావణమాసం పూర్తయ్యేలోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములకు ఎంజాయ్మెంట్సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదే టైమ్‌లో అసైన్డ్ భూములకు భూధార్నెంబర్ కేటాయించాలని సూచించారు. ఎంజాయ్మెంట్సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో అసైన్డ్ భూముల యజమానులను గుర్తించడంతో పాటు భూముల హద్దులను నిర్ధారిస్తారు. అసైన్డ్ భూముల సర్వే తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూముల సర్వే చేసి, భూధార్నెంబర్లు కేటాయించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలన్నారు.
ఇందుకోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అసైన్డ్కమిటీల ఏర్పాటుకు ఆయన గ్రీన్సిగ్నల్ఇచ్చారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల పరిష్కారం చివరి దశకు వచ్చిన తరువాత అసైన్డ్కమిటీల పని మొదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అసైన్డ్కమిటీల్లో స్థానిక ఎమ్మెల్యే, ఆర్డీవో సభ్యులుగా ఉండాలని.. ఇన్‌చార్జ్ మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్ కోచైర్మన్‌గా ఉండాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో భూదాన్కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ‘‘గత ప్రభుత్వం 2016లో భూదాన్ కమిటీని రద్దు చేసింది. ప్రస్తుతం భూదాన్ భూముల విషయంలో విమర్శలు వస్తున్నాయి. దీంతో భూదాన్ భూముల నిర్వహణ పక్కాగా ఉండేలా, భూదాన్ యాక్ట్ ప్రకారం కమిటీ వేయాలి. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి” అని అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ సదస్సుల అప్లికేషన్లపై ఆరా..
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్ల స్టేటస్‌పై అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సదస్సుల్లో 8 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. సాదాబైనామా కేటగిరీలో 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని.. మిస్సింగ్ సర్వే నెంబర్లు, ఇతర డేటా కరెక్షన్‌కు సంబంధించి 2 లక్షలకు పైగా అప్లికేషన్లు.. మ్యుటేషన్, సక్సెషన్, కోర్టు కేసులు పెండింగ్కింద లక్షకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు.
సాదాబైనామాల అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, దీనిపై వచ్చే మంగళవారం కోర్టు తీర్పు వస్తుందని చెప్పారు. దీంతో ఆ తీర్పు వచ్చిన తర్వాత సాదాబైనామా అప్లికేషన్లలో అర్హమైనవన్నీ వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఇక మ్యుటేషన్ చార్జీలకు సంబంధించి సమీక్షలో చర్చకు వచ్చింది.
ప్రస్తుతం ఎకరాకు రూ.2,500 మ్యుటేషన్ కోసం చార్జ్చేస్తున్నారని, ఈ మొత్తాన్ని కూడా కాస్త తగ్గించాలనే ప్రతిపాదన వచ్చింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. అమౌంట్పూర్తిగా తీసివేస్తే కింది స్థాయిలో కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడే అవకాశం కూడా ఉన్నందున, ఇప్పుడున్న మొత్తాన్ని కొంత తగ్గిస్తే రైతులకు మేలవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.
భూముల విలువ సవరణపై చర్చ..
స్టాంప్స్అండ్రిజిస్ర్టేషన్ల శాఖపైనా సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. భూముల విలువల సవరణ, స్టాంప్‌డ్యూటీపై చర్చించారు. రానున్న కేబినెట్ మీటింగ్ కల్లా సవరించిన మార్కెట్‌వాల్యూ ప్రతిపాదనలు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. అదే విధంగా స్టాంప్‌డ్యూటీ కాస్త తగ్గించాలని సూచించారు.
ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో గ్రామ పాలనాధికారుల నియమాక పత్రాల పంపిణీ ఈ నెల 20 తరువాత చేపట్టాలని ఆదేశించారు. శేరిలింగంపల్లిలో నూతనంగా నిర్మించిన సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాన్నివచ్చే వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక కోర్ అర్బన్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను కూడా సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలన్నారు.
త్వరలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శ్రావణమాసం పూర్తయ్యేలోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. హైదరాబాద్‌లో హౌసింగ్ బోర్డు జాయింట్ వెంచర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సమీక్షలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, కేఎస్.శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.