తక్కువ డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలా..? వారెన్ బఫెట్ చెప్పిన ఈ టెక్నిక్స్ బెస్ట్..

తక్కువ డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయాలా..? వారెన్ బఫెట్ చెప్పిన ఈ టెక్నిక్స్ బెస్ట్..

Warren Buffett: వారెన్ బఫెట్ పెట్టుబడుల ప్రపంచంలో ఒక విజయవంతమైన వ్యక్తి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన తన 94 ఏళ్ల వయస్సులో కూడా తన సక్సెస్ కొనసాగించటానికి కారణం ఆర్థిక అంశాలపై ఆయనకు ఉన్న పట్టే. 140 బిలియన్ డాలర్ల సంపదకు అధిపతి అయిన బఫెట్ ఇప్పటికీ అవసరమైన మేరకే ఖర్చు చేస్తూ సింపుల్ జీవితాన్ని గడపటంతో పాటు కోట్ల మందికి ఆయన పెట్టుబడి సూత్రాలు మార్గనిర్దేశంగా కొనసాగుతున్నాయి. 

వారెన్ బఫెట్ పెట్టుబడి సూత్రాలు చాలా తక్కువ డబ్బు పెట్టుబడికి కలిగి ఉన్న వ్యక్తులకు సెట్ అవుతాయా అనే ప్రశ్నకు అవును అని జవాబు వినిపిస్తోంది. ఎందుకంటే బఫెట్ కూడా చిన్న మెుత్తం పెట్టుబడితోనే తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎదుగుదలకు మంచి అవకాశం ఉన్న చిన్న మంచి కంపెనీలను తక్కువ డబ్బుతో కొన్నానని, రిస్క్ ఉన్నట్లే వాటి నుంచి డబ్బు కూడా పొందినట్లు బఫెట్ చెప్పారు. చిన్న మెుత్తంతో పెట్టుబడులు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ పరిశీలించి సరైన ఎంపికలతో ముందుకెళతామని అన్నారు. 

వారెన్ బఫెట్ దృష్టిలో పెట్టుబడి అనేది కేవలం డబ్బును కలిగి ఉండటం మాత్రమే కాదు జ్ఞానాన్ని కలిగి ఉండటం. అందుకే ఆయన ప్రతి రోజూ పుస్తకం చదవటం అలవాటుగా మార్చుకున్నారు. చిన్న మెుత్తంతో పెట్టుబడిని స్టార్ట్ చేయటం మంచిదంటారు. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి జర్నీని తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ఇండెక్స్ ఫండ్స్ నుంచి ప్రారంభించటం సురక్షితమని చెబుతుంటారు. దీనికి తోడు ఏదైనా స్టాక్ ఎంచుకునే ముందు ఆ కంపెనీ ఆర్థిక ఫలితాలు, భవిష్యత్తు ప్లాన్స్, బిజినెస్ మోడల్ వంటి అంశాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు బఫెట్. 

చిన్న పెట్టుబడులతో స్టార్ట్ చేసినప్పటికీ ఇన్వెస్టర్లు.. దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంతోనే నడవాలని ఆయన చెబుతుంటారు. రోజుల్లో గంటల్లో రెట్టింపు లాభాలు కోరుకుంటే చివరికి నష్టాలు మిగిలే ప్రమాదం ఉందని ఆయన నమ్ముతుంటారు. అలాగే తక్కువ బ్రోకరేజ్, టాక్సులు ఉండేలా చూసుకోవాలని చెబుతుంటారు. ఇక స్టాక్స్ ఎంపిక విషయంలో ఫ్యాన్సీ రిటర్న్స్ అంటూ ఊదరకొట్టే వాటికి దూరంగా ఉంటూ మంచి వ్యాల్యుయేషన్ ఉన్న వాటిని ఎంచుకోవాలని పెట్టుబడిదారులకు సూచిస్తుంటారు బఫెట్. కాంపౌండింగ్ ఒక పెద్ద మ్యాజిక్ అని దానికి ఎక్కువ సమయం అవసరమని ఆయన చెబుతుంటారు.