Allu Aravind : సినీ పరిశ్రమలో "ఎవరి కుంపటి వారిదే".. అల్లు అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు

Allu Aravind : సినీ పరిశ్రమలో "ఎవరి కుంపటి వారిదే".. అల్లు అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ తెలుగు చలన చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమాకు ఏకంగా ఏడు అవార్డులు వచ్చినప్పటికీ, చిత్ర పరిశ్రమ నుంచి సరైన స్పందన లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సైమా’ (SIIMA) అవార్డ్స్‌ బృందం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“జాతీయ అవార్డులు రావడం మనందరికీ గర్వకారణం. ఒకప్పుడు ఒకటి రెండు అవార్డుల కోసం ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు ఏకంగా ఏడు పురస్కారాలు వచ్చాయి. ఇది ఒక పండుగలా జరుపుకోవాల్సిన సందర్భం. కానీ మన పరిశ్రమలో జాతీయ అవార్డులు వచ్చిన వారిని సత్కరించే సంప్రదాయం లేదు. "ఎవరి కుంపటి వారిదే" అన్నట్లుగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ పని తాము చేసుకుపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి. జాతీయ పురస్కారాలకు ఎంపికైన వారిని ప్రోత్సహించి, గౌరవించాలి. ‘సైమా’ బృందం ఈ విషయంలో ముందుకొచ్చి, అవార్డు విజేతలను సత్కరించడం చాలా అభినందనీయం అని అల్లు అరవింద్‌ అన్నారు.

‘సైమా’ వేదికగా జాతీయ అవార్డుల విజేతలకు సత్కారం
సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్‌లో జరగబోయే ‘సైమా’ అవార్డ్స్‌ వేడుకకు ముందు, హైదరాబాద్‌లో ఈ ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సైమా’ టీమ్‌ 71వ జాతీయ అవార్డుల విజేతలను సత్కరించింది. ఇందులో ఉత్తమ తెలుగు సినిమాగా నిలిచిన 'భగవంత్‌ కేసరి' దర్శకుడు అనిల్‌ రావిపూడి, 'బేబీ' చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత అవార్డు పొందిన సాయి రాజేశ్‌, మరియు 'బేబీ' చిత్రంలోని 'ప్రేమిస్తున్నా' పాటకి ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్న పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌లకు సత్కారాలు జరిగాయి.

ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, నటులు సందీప్‌ కిషన్‌, ఫరియా అబ్దుల్లా, మంచు లక్ష్మి, నటి వేదిక వంటివారు ఈ ప్రెస్‌మీట్‌లో పాల్గొని, జాతీయ అవార్డు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అరవింద్ చేసిన ఈ కీలక వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో ఒక కొత్త చర్చకు దారీతీశాయి. ఇలాంటి కీలక సందర్భాల్లో అందరూ కలిసికట్టుగా ఉండి, విజేతలను సత్కరించాలని ఆయన ఇచ్చిన పిలుపు ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.