
ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించిన 36 మంది వైమానిక యోధులకు కేంద్ర ప్రభుత్వం గురువారం(ఆగస్టు14) శౌర్య పురస్కారాలను ప్రకటించింది. మురిడ్కే ,బహవల్‌పూర్‌లోని ఉగ్రవాద గ్రూపుల ప్రధాన కార్యాలయాలను, ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ సైనిక ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న ఫైటర్ పైలట్లతో సహా తొమ్మిది మంది భారత వైమానిక దళ అధికారులకు వీర్ చక్ర లభించింది. - ఇది యుద్ధకాలంలో మూడో అత్యున్నత శౌర్య పతకం.
ఒకరికి శౌర్య చక్రాన్ని ప్రదానం చేశారు. శత్రువులతో నేరుగా తలపడకుండా ధైర్యంగా వ్యవహరించడం లేదా ఆత్మబలిదానాలు చేసినందుకు శౌర్య చక్రాన్ని ప్రదానం చేస్తారు. ఇది అశోక చక్ర ,కీర్తి చక్రాల తర్వాత స్థానంలో ఉంది. మరో 26 మందికి వాయు సేన పతకాన్ని ప్రదానం చేశారు.
వీర్ చక్ర గ్రహీతలలో గ్రూప్ కెప్టెన్లు ఆర్.ఎస్. సిద్ధూ, మనీష్ అరోరా, అనిమేష్ పట్ని ,కునాల్ కల్రా ఉన్నారు. వింగ్ కమాండర్ జాయ్ చంద్ర, స్క్వాడ్రన్ లీడర్లు సార్థక్ కుమార్, సిద్ధాంత్ సింగ్, రిజ్వాన్ మాలిక్ ,ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎ.ఎస్. ఠాకూర్‌లను కూడా సత్కరించారు.
మే 7న ప్రారంభించబడిన ఆపరేషన్ సిందూర్..26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రత్యక్ష ప్రతిస్పందన భారత దళాలు పాకిస్తాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి.ఫలితంగా 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ప్రతీకార చర్య భారతదేశ సైనిక దృఢ సంకల్పాన్ని ,వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
వైమానిక దళ అధికారులకు తొలిసారిగా 'సర్వోత్తమ యుద్ధ సేవా పతకం' ప్రదానం చేస్తున్నారు.
మొత్తం మీద ఈ శౌర్య పురస్కారాలు భారత వైమానిక దళ సిబ్బంది ధైర్యం ,నైపుణ్యానికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా అమలు చేయడంలో వారి అంకితభావం,ధైర్యం కీలక పాత్ర పోషించాయి. భారతదేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ గుర్తింపు లభించడం జాతి గర్వానికి గుర్తు.