శిల్పాశెట్టి దంపతులపై కేసు.. ముంబై వ్యాపారవేత్త ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు

శిల్పాశెట్టి దంపతులపై కేసు..  ముంబై వ్యాపారవేత్త ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్లు మోసం చేసినట్లు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి.. నటి శిల్పా శెట్టి, ఆమె భర్తరాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

2015 2023 మధ్యకాలంలో శిల్పా శెట్టి దంపతులు.. రూ.60 కోట్లు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. తన వ్యాపార సంస్థలను విస్తరించడానికి తాను ఆ డబ్బును పెట్టుబడి పెట్టానని, ఆ నిధులను శెట్టి వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేశారని కొఠారి చెప్పు కొచ్చారు. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తనకు శిల్పా శెట్టి, రాజ్ కుండ్రా పరిచయం అయినట్టు కొఠారీ తెలిపారు.  ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండేవారని, కంపెనీలో దాదాపు 87.6% వాటా వారిదేనని చెప్పారు. 

మొదట 12 శాతం వడ్డీతో రూ.75 కోట్ల రుణం కావాలని వారు కోరారని, కానీ అధిక పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు ఆ మొత్తా న్ని రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలని తనను ఒప్పించారని కొఠారీ వివరించారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి, 2015 ఏప్రిల్లో రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్లో మరో రూ.28.53 కోట్లు బదిలీ చేసినట్లు కొఠారీ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.