మందు బాబులకు గుడ్ న్యూస్ : అర్థరాత్రి 12 గంటల వరకు బార్లు.. ఉదయం 10 నుంచే ఓపెన్

మందు బాబులకు గుడ్ న్యూస్ : అర్థరాత్రి 12 గంటల వరకు బార్లు.. ఉదయం 10 నుంచే ఓపెన్

ఏపీలో కొత్త బార్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈమేరకు బుధవారం ( ఆగస్టు 13 ) రాత్రి కొత్త బార్ పాలసీకి సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని తెలిపింది ఎక్సైజ్ శాఖ.వచ్చే మూడేళ్ల పాటు ఈ పాలసీని అమలు చేయనున్నట్టు తెలిపింది ప్రభుత్వం. ఈ కొత్త పాలసీలో చాలా కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో బార్లను వేలం ద్వారా కేటాయించగా, ఇప్పుడు లాటరీ పద్ధతిని అమలు చేయనుంది ప్రభుత్వం. ఇందుకు గాను 840 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అంతే కాకుండా గీత కార్మికుల కోసం మరో 84 బార్లకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.. ఇక లాటరీ నిర్వహణకు ఒక బార్‌కి కనీసం నాలుగు దరఖాస్తులు రావాలనే రూల్ కొత్త బార్ పాలసీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక బార్ల పని వేళల్లో కూడా మార్పు తీసుకొచ్చింది ప్రభుత్వం. బార్ల పని వేళలను రెండు గంటల పాటు పెంచింది. ఇప్పటిదాకా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా బార్లు తెరిచి ఉంటుండగా.. కొత్త బార్ పాలసీ ప్రకారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉండనున్నాయి.దరఖాస్తు రుసుము కింద నాన్ రిఫండబుల్ ఫీజు రూ. 5 లక్షలు అదనంగా రూ. 10 వేలు చెల్లించాలని తెలిపింది ప్రభుత్వం.

మూడు కేటగిరీల్లో లైసెన్స్ ఫీజు:

  • 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో.. రూ. 35 లక్షలు
  • 50వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో.. రూ. 55 లక్షలు
  • 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో.. రూ. 75 లక్షలు

ప్రతి ఏటా ఈ లైసెన్స్ ఫీజు 10 శాతం పెరుగుతుంది. గీత కార్మికులకు మాత్రం లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీ ఉండనుంది. కొత్తగా ప్రవేశపెట్టిన రూ. 99 క్వార్టర్ మద్యాన్ని బార్లలో అమ్మకూడదని తెలిపింది ప్రభుత్వం.

ALSO READ : తిరుమల కొండపై దోపిడీ దొంగలు

విమానాశ్రయాల్లో కూడా బార్లు: 

కొత్త బార్ పాలసీ ప్రకారం ఎయిర్ పోర్టుల్లో కూడా బార్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం.అయితే.. తిరుపతి ఎయిర్ పోర్టును ఈ విధానం నుంచి మినహాయించినట్లు తెలిపింది ప్రభుత్వం.విమానాశ్రయాల్లో బార్ ఏర్పాట్లపై త్వరలోనే కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు  తెలిపింది ప్రభుత్వం.