
▪️ ఇండియా నుంచి శుభాకాంక్షలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి
▪️ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కోదండరాం, ఆకునూరి మురళి, పలువురు ప్రముఖులు
▪️ 'ప్రగతి తెలంగాణం' పేరిట 3 రోజుల పాటు కార్యక్రమాలు
▪️ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో వేడుకలు
మిల్పిటాస్ (కాలిఫోర్నియా): అమెరికాలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ (TDF) USA సిల్వర్ జూబిలీ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న టీడీఎఫ్ రజతోత్సవ వేడుకలను ‘ ప్రగతి తెలంగాణం’ పేరిట నిర్వహించారు. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ ఇండియా కమ్యూనిటీ సెంటర్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు పంపగా, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, సాన్‌ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డా. కే. శ్రీకర్ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డా. ఎం.వి. రెడ్డి, ‘ఆటా’ అధ్యక్షుడు జయంత్ చల్లా తదితరులు హాజరయ్యారు.
కల్చరల్గా.. కలర్ ఫుల్గా మూడు రోజుల వేడుకలు
టీడీఎఫ్ వేడుకులు కలర్ ఫుల్ గా, ఎంతో ఆకర్షణీయంగా నిర్వహించారు. టీడీఎఫ్ అమెరికా చైర్మన్ మురళి చింతలపాణి, అధ్యక్షుడు మణికొండ శ్రీనివాస్, కన్వీనర్ మహేందర్ రెడ్డి గూడూరు, కో-కన్వీనర్ సుజేందర్ ప్రొదుటూరి సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ బిజినెస్ ఫోరం, పొలిటికల్ ఫోరం, స్టార్టప్ ఫోరం, విజన్ తెలంగాణ-2050 వంటి అంశాలపై చర్చలు జరిగాయి. 2050 నాటికి తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దే వ్యూహాలపై ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
సాంస్కృతిక వైభవం
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా వేడుకలు నిర్వహించారు. అందులో భాగంగా తెలంగాణ ఫోక్ నైట్, ఆటా పాటలు, బోనాల వేడుకలు ఆహూతులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింభించిన ఈ కార్యక్రమాల్లో యాంకర్ వాణి గడ్డం తెలంగాణ యాసతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పురస్కారాల ప్రదానం
టీడీఎఫ్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా పలువురు ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు.డా. దివేష్ అనిరెడ్డి, డా. గోపాల్ రెడ్డి గాదేలకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, టీడీఎఫ్ లైఫ్‌టైమ్ ఫిలాంత్రఫీ అవార్డు టీ. రామచంద్రరెడ్డికి ప్రదానం చేశారు. సోషల్ ఇంపాక్ట్ పార్ట్‌నర్ అవార్డులు గ్లోబల్ ప్రగతి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అలోక్ అగర్వాల్, డాక్టర్ సంగీతకు అందజేశారు. టీడీఎఫ్ పూర్వ అధ్యక్షురాలు చల్లా కవితను ఘనంగా సత్కరించారు. వారి సేవలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియోలు ప్రదర్శించారు.
ఇక ఈ వేడుకల్లో శ్రీరామ్ వెదిరె, బిక్ష గుజ్జ నీటి నిర్వహణపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. టీడీఎఫ్ సీనియర్ నాయకులు మధు కె. రెడ్డి, సుధీర్ కోదాటి, ఎలక్ట్ ప్రెసిడెంట్ భరత్ నేరవెట్ల, ఉపాధ్యక్షురాలు ప్రీతి జొన్నలగడ్డ, స్వాతి సుదిని, ఉపాధ్యక్షులు శ్రావణ్ పోరెడ్డి, శ్రీని గెల్లిపెల్లి, సెక్రటరీ రాజ్ గడ్డం, జాయింట్ సెక్రటరీ మనోహర్, ట్రెజరర్ శ్రీకళ, ట్రస్టీలు గోపాల్ రెడ్డి గాదే, ఇందిరా, కళ్యాణ్ రెడ్డి, కాసప్ప, రవిరెడ్డి, సదానంద్, విజేందర్, వినయ తదితరుల సమిష్టి కృషితో ఈ వేడుకలు విజయవంతమయినట్లు నిర్వాహకులు తెలిపారు. 70 మంది బేఏరియా TDF వాలంటీర్లు వేడుకలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారని చెప్పారు. తెలంగాణ నుంచి, అమెరికా నలుమూలల నుంచి ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.