
- ఎల్ఎల్‌బీలో 18 శాతం, ఎల్ఎల్ఎంలో 20 శాతమే ఇస్తున్నరు: దాసోజు శ్రవణ్
- కేంద్ర న్యాయ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. నేషనల్ లా కాలేజీల్లో బీసీ విద్యార్థులకు రిజర్వేషన్ అమలు కావడం లేదని ఫైర్ అయ్యారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. నల్సార్లో రిజర్వేషన్ల అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. ప్రతిష్టాత్మక నల్సార్ లా యూనివర్సిటీలోను బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆరోపించారు.
జస్టిస్సుదర్శన్ రెడ్డి సహా అనేక మంది ఉద్ధండులు నల్సార్బోర్డులో ఉన్నా రిజర్వేషన్లు అమలు కావడం లేదని తెలిపారు. 2020లో నేషనల్బీసీ కమిషన్.. అన్ని లా యూనివర్సిటీల్లో 27 శాతం బీసీ రిజర్వేషన్లతో పాటు స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశాలిచ్చిందని గుర్తు చేశారు. కానీ, 18 శాతం రిజర్వేషన్లే ఇస్తున్నారని ఆరోపించారు. బీఏ ఎల్ఎల్ బీలో 18 శాతం (132 సీట్లకు 17 సీట్లే), ఎల్ఎల్ఎంలో 20 శాతం రిజర్వేషన్లే అమలవుతున్నాయని చెప్పారు. స్టేట్ కోటా కింద 25 శాతం రిజర్వేషన్లు దక్కడం లేదని పేర్కొన్నారు. ఎస్టీలకు10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉన్నా అమలు చేయడం లేదని వివరించారు. కాబట్టి నల్సార్లో రిజర్వేషన్లను అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరారు.