బీసీలకు సమాన అవకాశాలు రావట్లే : దాసు సురేశ్

బీసీలకు సమాన అవకాశాలు రావట్లే : దాసు సురేశ్

ముషీరాబాద్, వెలుగు :  సబ్బండ వర్గాల మద్దతుతో సామజిక న్యాయమే ధ్యేయంగా ఏర్పడిన తెలంగాణలో బీసీలకు సమాన అవకాశాల్లేక సామాజిక న్యాయం కుంటుపడుతున్నదని బీసీ రాజ్యాధికార సమితి పేర్కొంది. బుధవారం హైదరాబాద్‌‌ బాగ్ లింగంపల్లిలోని సమితి కేంద్ర కార్యాలయంలో ‘ప్రభుత్వ పదవులు.. దక్కాల్సిన వాటా’పై బీసీ నేతలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికుల ఆద్శర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార అధ్యక్షుడు దాసు సురేశ్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అలాగే, కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వంపై నిరంతరం పోరాటం చేసిన ప్రజా ఉద్యమ సంఘాల నాయకులను ప్రభుత్వంలో అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌‌ను కోరారు.

ప్రజా పోరాటాలతో మద్దతుగా నిలిచిన సివిల్ సొసైటీ నాయకులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు ఇవ్వాలన్నారు. రాహుల్ గాంధీ సామజిక న్యాయం కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుండగా.. తెలంగాణలో పదవులన్నీ రెడ్డి సామాజిక వర్గానికే పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని బీసీల ఆర్థిక స్థితిగతుల ఎదుగుదలకు సహకరించాలని కోరారు.