
వలపు వలలో యూత్ విలవిల
బయటికి చెప్పుకోలేకపోతున్న బాధితులు
–ఏటా మోసపోతున్న 30% యువత
-సాఫ్ట్వేర్ ఉద్యోగులే అధికం
‘హాయ్..హ్యాండ్సమ్’ అని ఎవరైనా అమ్మాయి అంటే ఆ కుర్రాడి పని అయిపోయినట్టే. ఇక డేటింగ్ అంటూ ఆఫర్ ఇస్తే ఆగుతారా? దేనికైనా రెడీ అవుతారు. ఈ బలహీనతనే ఆసరాగా తీసుకున్న కొంతమంది జేబులు ఖాళీ చేస్తున్నారు. డేటింగ్ యాప్స్ ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిష్టర్ చేసుకుంటున్న యూత్ అందంగా ఉన్న యువతులకు రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. టెక్కీలైతే వెంటనే యాక్సెప్టెన్సీ వస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. రోజూ చాట్ చేస్తూ ముగ్గులోకి దింపుతున్నారు. రకరకాల కథలు చెబుతూ లక్షల్లో దోచుకుంటున్నారు. వీటి వెనక ఉన్న ముఠాలు అమ్మాయిలను పంపుతామంటూ ముందుగా మనీ ట్రాన్స్‌ఫర్ చేయించుకుని చీట్ చేస్తున్నాయి. కానీ పరువు పోతుందని కంప్లయింట్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.
‘ మాదాపూర్ కి చెందిన ఆర్యన్ జైన్ సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. తన కంపెనీ నుంచి ఫారిన్ లో వర్క్ చేసే అవకాశం రావడంతో యూఎస్ వెళ్లాడు. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయిని పెళ్లిచేసుకోవాలనుకున్న ఆర్యన్ ఓ డేటింగ్ యాప్ లో తన ఫ్రొఫైల్ పోస్ట్ చేశాడు. హైదరాబాద్ కి చెందిన ఓ అందమైన అమ్మాయి ఫొటోతో డేటింగ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ అమ్మాయితో ఆర్యన్ ఆన్ లైన్ లో డేటింగ్ చేశాడు. ఆ అమ్మాయి ఫారిన్ వచ్చేందుకు రూ.4లక్షలను ఆర్యన్ ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశాడు. 90 రోజుల తర్వాత ఆ యువతి కోసం ఆర్యన్ యూఎస్ నుంచి హైదరాబాద్ వచ్చాడు కానీ ఆమె అతడిని కలవలేదు. ఆన్ లైన్ డేటింగ్ పేరుతో ఆ అమ్మాయి తనను మోసం చేసిందని గ్రహించిన ఆర్యన్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు’
యువత బలహీనతలనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ లో ఏదో రకంగా మోసాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆన్ లైన్ డేటింగ్ యాప్స్, సైట్ల లో యువతీయువకులను లక్ష్యంగా చేసుకుని వారు డబ్బులు కొట్టేస్తున్నారు. ఆన్ లైన్ డేటింగ్ సైట్లు, యాప్స్ లో పరిచయం లేని వ్యక్తులతో డేటింగ్ చేస్తున్న యువత…ఓ వైపు డబ్బు పొగొట్టుకోవడమే కాకుండా మానసికంగా ఇబ్బందులకు గురవతున్నట్టు సైబర్ క్రైమ్ కేస్ స్టడీస్ వెల్లడిస్తున్నాయి. సైబర్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రతీ ఏటా ఆన్ లైన్ డేటింగ్ సైట్లలో సైబర్ నేరగాళ్ళ వలలో చిక్కి.. దేశంలోని దాదాపు 30 శాతం యువత మోసాలకు గురవుతోంది. రోజూ 8శాతం మంది అమ్మాయిలు,13 శాతం మంది అబ్బాయిలు ఆన్‌లైన్ డేటింగ్‌యాప్స్ ను తమ సెల్ ఫోన్లలలో వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. డేటింగ్ టార్గెట్ లో మార్కెట్లోకి వచ్చిన ‘టిండర్ ’ యాప్ తో పాటు సోషల్ సైట్లలో ఇప్పటికే ఇలాంటి యాప్స్ వందల సంఖ్యలో ఉన్నాయి. ఈ ఆన్ లైన్ డేటింగ్ సైట్లు, యాప్స్ లో పరిచయం అవుతున్న అమ్మాయిలు,అబ్బాయిలు డేటింగ్ చేస్తూ.. మనీతో పాటు ఆన్ లైన్ లోనే అసభ్య దృశ్యాలను షేర్ చేసుకుంటున్నారు. మోసాలకు గురవుతున్న వారిలో ఎక్కువగా 17 ఏళ్ళకు పైబడిన వాళ్ళే బాధితులుగా ఉన్నారని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు.
ఈ ఏడాది మార్చి15న
కర్నూలు జిల్లా లక్ష్మీనగర్ కు చెందిన అబ్దుల్లా డేటింగ్ సైట్లలో కొన్ని నంబర్ లను సేకరించాడు. డాక్టర్ కార్తీక్ రెడ్డి పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. తాను ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో అనస్థిషీయా డాక్టర్ గా ప్రొఫైల్ లో రాసుకున్నాడు. డేటింగ్ పేరుతో నలుగురు యువతులను ట్రాప్ చేశాడు. తన ట్రాప్ లో చిక్కిన యువతుల ఫొటోలు,వీడియోలు సేకరించాడు. ఆ తర్వాత అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. అబ్దుల్లా చేతిలో మోసపోయి వేధింపులు తట్టుకోలేని సిటీకి చెందిన ఓ బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. ఈ ఏడాది మార్చి 15న అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు.
గతేడాది సెప్టెంబర్ 25న
కర్నాటకకి చెందిన మాథ్యూస్ హీరోయిన్ల పేరుతో ఫేక్ డేటింగ్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఒక్కో వ్యక్తి దగ్గరి నుంచి రూ.10 నుంచి 15 వేల వరకు వసూలు చేశాడు. మాథ్యూస్ ట్రాప్ లో చిక్కిన ఓ బాధితుడు రూ.15లక్షలు కొల్పోయాడు. ఆ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో నిందితుడు మాథ్యూస్ ను గతేడాది సెప్టెంబర్ 25న అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు 150 మందికి పైగా బాధితులు ఉన్నట్టు గుర్తించారు. చాలామంది బాధితులు తమకు కంప్లయింట్ చేయడం లేదని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.
వెస్ట్ బెంగాల్ గ్యాంగ్
వెస్ట్ బెంగాల్ కి చెందిన ఓ ముఠా ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ లో సిటీకి చెందిన యువతీయువకులను ట్రాప్ చేస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. వీరు డేటింగ్ యాప్ లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్ ని రూ.50 వేల నుంచి 4లక్షలు ట్రాన్స్ ఫర్ చేయించుకుంటున్న పోలీసులు గుర్తించారు.
పాతబస్తీ అడ్డాగా నైజీరియన్ల మోసం
రెండేళ్ల క్రితం పాతబస్తీ అడ్డాగా ఐదుగురు సభ్యుల నైజీరియన్ల ముఠా డేటింగ్ పేరుతో ఓ ఆస్ట్రేలియన్ ను మోసం చేసింది. సరా పేరుతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఆస్ట్రేలియన్ ట్రాప్ చేసింది. ఈ కేసులో నైజీరియన్లు హస్సాని బరూయ్,మొసిన్ ఆఘా అనే వ్యక్తులు డేటింగ్ వెబ్ సైట్ లో ఓ అందమైన అమ్మాయి ఫోటోను పోస్ట్ చేశారు. తాను ఆస్ట్రేలియన్ యువతి సరాగా నమ్మించి ఆస్ట్రేలియన్ దేశస్తుడి నుంచి 95 వేల డాలర్లను మనీ గ్రామ్ ద్వారా వసూలు చేసింది. ఈ కేసులో ఆ యువతిని కలిసేందుకు హైదరాబాద్ కు వచ్చిన 65 ఏళ్ల ఆస్ట్రేలియన్ తను మోసపోయానని గుర్తించి సీఐడీ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు దర్యాప్తు చేసిన సీఐడీ నలుగురు నైజీరియన్లను అరెస్ట్ చేసి రూ.20లక్షలు సీజ్ చేసింది.
ట్రాప్ చేస్తున్నరు
ఆన్ లైన్ లో డేటింగ్ లో ఎక్కువగా సాఫ్ట్ వేర్ జాబ్ చేసే యువతీయువకులే మోసపోతున్నారు. సైబర్ నేరగాళ్లు వారిని ట్రాప్ చేసి చేసి డేటింగ్ నుంచి పెళ్లి వరకు తీసుకొచ్చి డబ్బులు కొట్టేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ కి చెందిన గ్యాంగ్ సిటీలో యువతను టార్గెట్ చేసి ఇలాంటి మోసాలకు పాల్పడుతోంది. – శ్రీనివాస్,ఏసీపీ,సైబర్ క్రైమ్, సైబరాబాద్