
న్యూఢిల్లీ: జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి పదవిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం (జూలై 23) ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేశారు. దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని.. అలాగే తెలగు వారికి సరైన గౌరవం దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఈ మాటలు ఇండియా కూటమి తరుపున కాదని.. తెలంగాణ ప్రజల తరుఫున మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటిస్తే.. ఆయనకు మద్దతు ఇచ్చేలా ఇండియా కూటమితో నేను మాట్లాడుతానని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో దేశ రెండో అత్యున్నత రాజ్యాంగం పదవి నుంచి ఆయన వైదొలిగారు. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాకు రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఉప రాష్ట్రపతి కుర్చీ ఖాళీ అయ్యింది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఉప రాష్ట్రపతి ఎన్నిక నిర్వహణకు కసరత్తు మొదలు పెట్టింది. ఉప రాష్ట్రపతి రేసులో ఆశావహులు చాలా మందే ఉన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, ప్రస్తుత రాజ్య సభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నాయక్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనా, జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తదితరుల పేర్లు ఉపరాష్ట్రపతి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
►ALSO READ | దమ్ముంటే గుజరాత్లో ఆ పని చేయండి: బీజేపీకి CM రేవంత్ సవాల్
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఉప రాష్ట్రపతి రేసులోకి తెలంగాణకు చెందిన సీనియర్ పొలిటిషియన్ దత్తాత్రేయ పేరు తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. దత్తాత్రేయ బీజేపీ మాజీ సీనియర్ నాయకులు. ఆయన బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేగా పని చేశారు. మొన్నటి వరకు హర్యానా గవర్నర్గా పని చేశారు. పదవి కాలం ముగిడయంతో ప్రస్తుతం దత్తన్న ఖాళీగానే ఉన్నారు. మరీ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగా దత్తాత్రేయ పేరును ఉప రాష్ట్రపతి పదవి కోసం ఎన్డీఏ పరిగణలోకి తీసుకుంటుందా లేదా చూడాలి.