తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో.. మామపై కోడలు, కొడుకుపై తండ్రి విజయం

తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో.. మామపై కోడలు, కొడుకుపై తండ్రి విజయం

రాయికల్, వెలుగు: మామతో ఉన్న విబేధాలతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన కోడలు గెలుపొందింది. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్ నగర్  గ్రామంలో తాళ్లపల్లి రాధిక మామయ్య(భర్త తండ్రి) సత్య నారాయణపై గెలుపొందారు. రాధిక భర్త శ్రీరామ్ కు, మామ సత్యనారాయణ మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలు రావడంతో శ్రీరామ్ తన భార్య రాధికతో నామినేషన్  వేయించాడు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో రాధికకు 91 ఓట్లు రాగా, సత్యనారాయణ గౌడ్ కు 71 ఓట్లు వచ్చాయి. సొంత మామపై రాధిక 14 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

అత్తపై కోడలు..

గోదావరిఖని : రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం ఘన్ శ్యామ్​ దాస్(జీడీ) నగర్​ సర్పంచ్​గా కోడలు గెలిచింది. సర్పంచ్​ పదవి బీసీ మహిళకు రిజర్వ్​ కాగా, సూర నర్సమ్మ, ఆమె పెద్ద కోడలు సూర రమాదేవి నామినేషన్​ దాఖలు చేశారు. నామినేషన్​ ఉపసంహరించుకోక పోవడంతో వీరిద్దరూ బరిలో నిలిచారు. కాంగ్రెస్​ మద్దతుతో వీరు పోటీ పడగా, అత్త సూరమ్మకు 856 ఓట్లు రాగా, కోడలు రమాదేవికి 874 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల మెజార్టీతో కోడలు విజయం సాధించింది.

కొడుకుపై తండ్రి ..

రామాయంపేట: మెదక్​ జిల్లా రామాయంపేట మండ లం ఝాన్సీ లింగాపూర్  గ్రామపంచా యతీ ఎన్నికల్లో  కొడుకుపై తండ్రి 99 ఓట్ల మెజార్టీతో సర్పంచ్​గా గెలుపొందాడు. గ్రామంలో 1,563 ఓట్లు ఉండగా, అందులో 1,385 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తండ్రి మానెగల్ల రామకిష్టయ్యకు 684 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి అయిన అతని కొడుకు వెంకట్ కు 585 ఓట్లు వచ్చాయి.