H-1B వీసాల రగడ.. డ్రాలో చెన్నైకి 2లక్షల 20వేల వీసాల దక్కటంపై చర్చ..

H-1B వీసాల రగడ.. డ్రాలో చెన్నైకి 2లక్షల 20వేల వీసాల దక్కటంపై చర్చ..

అమెరికా మాజీ ప్రతినిధి, ఆర్థిక నిపుణుడు డాక్టర్ డేవ్ బ్రాట్ భారత్‌ H-1B వీసా వ్యవస్థలో అధిక ఆధిపత్యంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అమెరికా దేశానికి 85వేల వీసాలు మాత్రమే లిమిట్ విధించినప్పటికీ.. భారతదేశంలోని చెన్నై నగరానికి సుమారు 2.2 లక్షల H-1B వీసాలు జారీ కావడం అన్యాయమని అన్నారు. ఇది వాస్తవ పరిమితికి రెండింతలకుపైగా ఉందని బ్రాట్ పేర్కొన్నారు. అమెరికన్లు తమ కుటుంబం గురించి ఆలోచించాలని.. వీసా మోసాలతో భవిష్యత్తును దోచుకుంటున్నారంటూ కామెంట్ చేయటం పెద్ద చర్చకు దారితీసింది. 

చైనా వాటా మొత్తం H-1B వీసాల్లో కేవలం 12 శాతమేనని  బ్రాట్ అన్నారు. రిపోర్ట్స్ ప్రకారం 2024లో చెన్నైలోని యూఎస్ కాన్సులేట్‌ దాదాపు 2.2 లక్షల H-1B వీసాలు, 1.4 లక్షల H-4 వీసాలను ప్రాసెస్‌ చేసిందని తేలింది. భారతీయులు హెచ్1బి వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని బ్రాట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా వ్యాఖ్యలు అమెరికన్‌ రాజకీయ విశ్లేషకుల తరచూ వస్తున్న విమర్శలను మరింత ఊపందించాయి. భారత్‌ H-1B వీసాలలో అధిక వాటా పొందడాన్ని వారు వ్యవస్థలో ఉన్న లోపాలకు ఉదాహరణగా చూపుతున్నారు. ఈ క్రమంలో చెన్నై కాన్సులేట్‌పై దృష్టి మళ్లింది, ఎందుకంటే గతంలో ఒక మాజీ అమెరికా రాయబారి అక్కడ భారీ స్థాయిలో మోసాలు జరిగినట్లు కూడా ఆరోపించారు.

మాజీ అమెరికా రాయబారి మహ్వాష్‌ సిద్దిఖీ, 2005–2007 మధ్య చెన్నై కాన్సులేట్‌లో విధులు నిర్వర్తించినప్పుడు “ఇండస్ట్రియలైజ్డ్ ఫ్రాడ్” చూసినట్లు తెలిపారు. భారత్‌ నుండి వచ్చే 80–90 శాతం H-1B వీసాలు నకిలీవేనని ఆమె అన్నారు. చాలా మంది అభ్యర్థులు తప్పుడు డిగ్రీలు, నకిలీ డాక్యుమెంట్లు లేదా తగిన నైపుణ్యం లేని వ్యక్తులకు  వీసాలు దక్కుతున్నట్లు ఆమె చెప్పారు. తాను పనిచేసిన సమయంలో దాదాపు 51వేల వీసా అప్లికేషన్స్ ప్రాసెస్ చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దరఖాస్తులు ఎక్కువగా అనుమానాలు రేకెత్తించినట్లు వెల్లడించారు. అమీర్‌పేట్‌ ప్రాంతంలో వీసా దరఖాస్తుల శిక్షణ ఇచ్చే పేరుతో నకిలీ ఎడ్యుకేషన్, వివాహ సర్టిఫికెట్లు తయారు చేసే కేంద్రాలు ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుతం డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలో అమెరికా ప్రభుత్వం H-1B వీసా వ్యవస్థ సంస్కరణలను వేగవంతం చేస్తోంది. రూల్స్ కఠినతరం చేయటం ద్వారా వీసా వ్యవస్థ దుర్వినియోగాన్ని అరికట్టడం, అమెరికన్‌ ఉద్యోగులను రక్షించడం ప్రధానంగా ఉన్నాయి. కొత్త విమర్శలతో భారత్‌ పై H-1B వ్యవహారంలో పారదర్శకతపై మళ్లీ ప్రశ్నలు తలెత్తాయి.