- అమెరికా ఆర్థికవేత్త కీలక ఆరోపణలు
న్యూఢిల్లీ: భారత్‌లోని హెచ్1బీ వీసా ప్రోగ్రాంలో భారీ మోసం జరిగిందని అమెరికా ఆర్థికవేత్త, రిపబ్లికన్ మాజీ ప్రతినిధి డేవ్ బ్రాట్ సంచలన ఆరోపణలు చేశారు. నిరుడు భారత్ కు 85 వేల హెచ్1బీ వీసాలు కేటాయిస్తే, ఒక్క చెన్నైకే 2.20 లక్షల వీసాలు ఇచ్చారని, అంటే మొత్తం కోటా కన్నా ఇది దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువని ఆయన పేర్కొన్నారు. ఓ పాడ్ కాస్ట్లో ఆయన మాట్లాడారు.
‘‘హెచ్1బీ వీసాల్లో 71% ఇండియా నుంచి, 12% చైనా నుంచి వస్తాయి. భారత్ నుంచి 71% వీసాలు వస్తున్నాయంటే అక్కడ ఏదో జరుగుతుండాలి. నేను హెచ్1బీ వీసాల గురించి మాట్లాడుతున్నానంటే మీరు (అమెరికన్లు) మీ కజిన్లు, ఆంటీలు, అంకుల్స్ గురించి ఆలోచించాలి. హెచ్1బీ వీసాలతో ఇండియన్లు అమెరికాకు వస్తారు. తాము స్కిల్డ్ వర్కర్లమని చెప్పుకుంటారు.
వాస్తవానికి వారిలో నైపుణ్యం ఉండదు. వారు అబద్దాలు చెప్పి అలాగే మోసం చేస్తారు. అడ్డగోలు మార్గంలో వీసాలు పొంది మన కుటుంబ సభ్యుల ఉద్యోగాలను వారు లాగేసుకున్నారు” అని బ్రాట్ వ్యాఖ్యానించారు. కాగా.. ఇండియన్ అమెరికన్ దౌత్యవేత్త మహ్ వష్ సిద్దికీ కూడా అంతకుముందే ఇలాంటి ఆరోపణలే చేశారు. 2005 నుంచి 2007 మధ్య చెన్నై కాన్సులేట్‌లో ఆమె పనిచేశారు.
ఒక్క 2024లోనే కొన్ని వేల నాన్ ఇమిగ్రెంట్ వీసాలు చెల్లవని అమెరికా అధికారులు తేల్చి చెప్పారని తెలిపారు. వాటిలో 2.20 లక్షల హెచ్ 1బీ వీసాలు, 1.4 లక్షల హెచ్ 4 వీసాలు ఉన్నాయని వెల్లడించారు. ఇండియన్లకు జారీచేసిన హెచ్ 1బీ వీసాల్లో చాలామటుకు మోసపూరితమే అని ఆరోపించారు. ఫేక్ ఎంప్లాయర్ లెటర్స్, ఫోర్జరీ చేసిన డిగ్రీల ఆధారంగా దరఖాస్తుదారులకు వీసాలు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని బహిరంగ ప్రదేశాల్లో ఫేక్ ఎంప్లాయ్ మెంట్లు లెటర్లు, ఫేక్ డిగ్రీలు అమ్ముతారని, అలా సర్టిఫికెట్లు పొందిన వీసా అప్లికేంట్లే అమెరికాకు వస్తారని ఆమె వ్యాఖ్యానించారు.
