
అడిలైడ్: తన బర్త్ డే రోజు.. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 నాటౌట్) బ్యాట్‌తో చెలరేగిపోయాడు. శ్రీలంక బౌలర్లపై సునామీలా విరుచుకుపడుతూ సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆసీస్ 134 పరుగుల భారీ తేడాతో లంకపై గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కంగారూలు 1–0 ఆధిక్యంలో నిలిచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 233 రన్స్ చేసింది. సొంతగడ్డపై ఆసీస్‌కు ఇదే అత్యధిక స్కోరు. యాషెస్ సిరీస్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 95 రన్స్ మాత్రమే చేసిన వార్నర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండి ఆఖరి బంతికి సెంచరీ పూర్తి చేశాడు. దీంతో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మూడో ఆసీస్ ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. గతంలో వాట్సన్, మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్‌ను సాధించారు. ఫించ్ (36 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 64)తో తొలి వికెట్‌కు 122 పరుగులు జోడించిన వార్నర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన మ్యాక్స్‌వెల్ (28 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 62) కూడా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్‌తో కలిసి రెండో వికెట్‌కు 107 రన్స్ సమకూర్చాడు. కాసున్ రజిత 4 ఓవర్లలో 75 రన్స్ ఇచ్చాడు.
దీంతో టీ20ల్లో ఎక్కువ రన్స్ ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టార్గెట్ ఛేజింగ్‌లో లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 99 పరుగులకే కుప్పకూలింది. షనక (17) టాప్ స్కోరర్. కుశాల్ పెరీరా (16), ఫెర్నాండో (13), గుణతిలక (11)తో సహా అందరూ విఫలమ్యారు. జంపా 3, స్టార్క్ 2, కమిన్స్ 2 వికెట్లు తీశారు. కాగా, ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్.. బుధవారం లంకతో జరిగే రెండో టీ20 నుంచి తప్పుకున్నాడు. సోదరుడి వెడ్డింగ్ కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదని తెలిపాడు. స్టాన్‌లేక్, సీన్ అబాట్‌లలో ఒకరికి చాన్స్ దక్కనుంది.