దావూద్ ముఖ్య అనుచరుడు అరెస్ట్

దావూద్ ముఖ్య అనుచరుడు అరెస్ట్
  • యూఏఈలో అదుపులోకి తీసుకున్న ఇండియా ఏజెన్సీలు
  • దేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
  • 2019లో చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న గ్యాంగ్‌స్టర్‌
  • అతడిపై 1997లోనే రెడ్ కార్నర్ నోటీసు

న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అతడు.. 1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు. ఒకటీ రెండు కాదు.. ఏకంగా 29 ఏళ్లుగా వెతుకుతున్నాయి మన ఏజెన్సీలు. ఎట్టకేలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌ (యూఏఈ)లో దొరికాడు. అతడే అబు బకర్ అబ్దుల్ గఫూర్ షేక్. ఈ టెర్రరిస్టును ఇండియాకు తీసుకొచ్చేందుకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం యూఏఈలో జరుగుతోంది. త్వరలోనే అతడిని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది. 1993 పేలుళ్ల ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన అబు బకర్.. చాలా ఏళ్లుగా యూఏఈ, పాకిస్తాన్‌‌లో తలదాచుకుంటున్నాడు. అతడిపై 1997లోనే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.  నిజానికి 2019లోనే బకర్‌‌‌‌ పట్టుబడ్డాడు. కానీ కొన్ని డాక్యుమెంట్ పరమైన సమస్యల వల్ల అతడు అరెస్టు నుంచి తప్పించుకున్నాడు. అప్పట్లో మొహమ్మద్, ముస్తఫా దొస్సా అనే మరో ఇద్దరితో కలిసి గల్ఫ్ దేశాల నుంచి ముంబైకి బంగారం, బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్మగ్లింగ్ చేసేవాడు. ఈ ముగ్గురు దావూద్ ఇబ్రహీం టీమ్‌‌లో కీలక సభ్యులు.

అసలైనోడు దొరకలే
1993 మార్చి 12న ముంబైలో 12 బాంబు పేలుళ్లు జరిగాయి. దాదాపు 257 మంది చనిపోగా, 1,400 మంది గాయపడ్డారు. తన అనుచరులైన టైగర్ మెమన్, యాకూబ్ మెమన్ సాయంతో దావూద్ ఇబ్రహీం ఈ దాడులకు ప్లాన్ చేశాడు. ఈ కేసులో యాకూబ్ మెమన్‌‌కు పడ్డ ఉరిశిక్షను సమర్థిస్తూ 2013 మార్చి 21న సుప్రీంకోర్టు తుదితీర్పు ఇచ్చింది. మరో 10 మందికి విధించిన ఉరి శిక్షను జీవితఖైదుగా మార్చింది. 2015 జులై 30న మహారాష్ట్ర ప్రభుత్వం యాకూబ్ మెమన్‌‌కు ఉరిశిక్ష అమలు చేసింది. మరో ఇద్దరు కీలక సూత్రధారులు దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్ మాత్రం ఇప్పటికీ దొరకలేదు. తాజాగా అబు బకర్ దొరికాడు.. ఇతడు దావూద్ దగ్గరికి దారి చూపుతాడేమో చూడాలి మరి!!