కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడినయ్: బూర నర్సయ్య గౌడ్

కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడినయ్: బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యలపై శాంతి యుతంగా ఆందోళనలు చేస్తున్న బీజేపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్​ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. పార్టీ స్టేట్ ఆఫీస్​లో గురువారం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని, అందులో డబుల్ బెడ్రూమ్, దళితులకు 3ఎకరాల భూమి ముఖ్యమైనవి అన్నారు. పబ్లిక్​కు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఫామ్​హౌస్​లు కట్టుకున్నారని ఆరోపించారు.

 హామీలపై పార్టీ లీడర్లు, కార్యకర్తలు శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసులు, అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగులుగా పోలీసులు పని చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థులందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. సిట్టింగ్​లకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతారనే భయం కేసీఆర్​కు పట్టుకుందన్నారు. ఓడిపోతాననే కారణంగానే కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని తెలిపారు.

పోలీసుల దాడి బాధాకరం: మనోహర్ రెడ్డి

అసమర్థ, అరాచక బీఆర్ఎస్ సర్కారును నిలదీసే లా, వైఫల్యాలను ఎండగట్టేలా బీజేపీ కొన్ని రోజులు గా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నదని, ఈ క్రమంలో నేతలపై పోలీసుల దాడి బాధాకరమని పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి అన్నారు. హనుమకొండ వెస్ట్ నియోజకవర్గంలో శాంతియుతంగా నిరసన చేపట్టిన బీజేపీ లీడర్లను పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దాడిచేసి గాయపర్చడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇటీవల నకిరేకర్​లో అక్కడి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లింగయ్య, నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి, వరంగల్ వెస్ట్​లో  వినయ్ భాస్కర్ అనుచరులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని తెలిపారు.