రాజస్థాన్ పై 33 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం

రాజస్థాన్ పై 33 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం
  • ఢిల్లీ స్కోర్ 154/6..  రాజస్థాన్ స్కోర్:  121

అబుదాబీ: ఐపీఎల్ టోర్నీలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచులో ఢిల్లీ కేపిటల్స్ విజయం సాధించింది. తక్కువ స్కోరు చేసినా బౌలర్ల అండతో ప్రత్యర్థి రాజస్థాన్ జట్టు ఏమాత్రం ఆధిక్యం చూపే అవకాశం ఇవ్వకుండా క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి చివరకు విజయం సొంతం చేసుకుంది. తక్కువ స్కోరు నమోదైన ఈ మ్యాచులో విజయం ఇరువైపులా దోబూచులాడడం కాసేపు ఉత్కంఠ సృష్టించింది. చివర్లో రన్ రేట్ పెరిగిపోవడంతో రాజస్థాన్ రాయల్స్  బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. చివరి ఓవర్లో 45 పరుగులు అవసరం కాగా అవేశ్ ఖాన్ బంతి తీసుకుని కేవలం 11 పరుగులే ఇచ్చాడు. దీంతో ఢిల్లీ జట్టు 33 పరుగుల తేడాతో రాజస్థాన్ పై విజయం సాధించింది. రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్ ఓపిగ్గా ఆడుతూ ఒంటరిపోరాటం (70) పరుగులు చేసినా పరాజయం తప్పలేదు.

టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టుకు రాజస్తాన్ ఆదిలోనే షాక్ ఇచ్చింది. వరుస వికెట్లు తీస్తూ స్కోరు బోర్డు పరిగెత్తకుండా కట్టడి చేసింది. దీంతో డిల్లీ జట్టులో ఒక్క శ్రేయాస్ అయ్యర్ (43), షిమ్రోన్ హెట్మెయర్ (16 బంతుల్లో 28 రన్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. డేషింగ్ బ్యాటర్ కెప్టెన్ రిషబ్ పంత్ 24 మాత్రమే చేసి పెవిటియన్ బాట పట్టగా చివర్లో లలిత్ యాదవ్ 14 పరుగులతో  నాటౌట్ గా నిలిచారు. చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు చేయడంతో స్కోరు 150 దాటింది.  ఢిల్లీ బ్యాటర్లను  కట్టడి చేసిన రాజస్థాన్ బౌలర్లలో ముస్తాఫిజూర్ రెహ్మాన్ 2, చేతన్ సకారియా 2, కార్తీక్ త్యాగి 1, రాహుల్ తెవాటియా 1 వికెట్ తీశారు.
ఆరంభంలోనే రాజస్థాన్ కు చుక్కలు
చిన్న టార్గెట్ అని బరిలోకి దిగిన రాజస్థాన్ కు రెండో ఓవర్లోనే చుక్కలు కనిపించాయి. తొలి ఓవర్ అవేశ్ ఖాన్ వేసిన చివరి బంతికి లివింగ్ స్టోన్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగాడు. ఆ వెంటనే రెండో ఓవర్ మొదటి బంతికి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (5)ను నోర్జె ఔట్ చేయడంతో రాజస్థాన్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ రాజస్థాన్ ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఐదో ఓవర్లోనే మరో వికెట్ దక్కింది. రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతికి డేవిడ్ మిల్లర్ స్టంప్ ఔట్ కావడంతో రాజస్థాన్ స్కోరు 4.2 ఓవర్లకు 19/3గా ఉంది. స్కోరు బోర్డు మెల్లగా కదులుతుండడంతో పరుగులు పెంచే క్రమంలో 11 ఓవర్లో నాలుగో వికెట్ సమర్పించుకుంది. నిలదొక్కుకున్నట్లే కనిపించిన మహిపాల్ లోమ్రోర్ (19) ను అవేశ్ ఖాన్ ఔట్ చేశాడు. దీంతో స్కోరు 11 ఓవర్లకు 49/4గా నమోదైంది. 12వ ఓవర్లో 5వ  వికెట్ గా రియాన్ పరాగ్ (2) వెనుదిరిగాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ స్కోరు 99/5గా ఉంది. చేయాల్సిన పరుగులు.. బంతుల మధ్య భారీ తేడా.. రన్ రేట్ పెరుగుతుండడంతో రాజస్థాన్ జట్టుపై ఒత్తిడి పెరిగింది. పరుగులు రాబట్టే ప్రయత్నంలో 18 ఓవర్లో రాహుల్ తెవాటియా ఔటయ్యాడు. దీంతో రాజస్థాన్ పీకలోతు కష్టాల్లో చిక్కుకుంది. చివరి 2 ఓవర్లలో 54 పరుగులు.. ఆ తర్వాత చివరి ఓవర్లో 45 పరుగుల భారీ టార్గెట్ ఉండడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. చివరి ఓవర్లో రాజస్థాన్ కేవలం 11 పరుగులు చేసి 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

 

మరిన్ని వార్తలు