ఐకే రెడ్డిపై విమర్శలు చేస్తే సహించబోం

ఐకే రెడ్డిపై విమర్శలు చేస్తే సహించబోం

నిర్మల్, వెలుగు: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదని, ఆయనపై అసత్య ఆరోపణ చేస్తే సహించబోమని డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 40 సంవత్సరాల నుంచి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ ను ఎంతగానో అభివృద్ధి చేశారని అన్నారు. నిర్మల్ ను జిల్లాగా మార్చడంతో ఐకే రెడ్డిని పాత్ర కీలకమన్నారు. అభివృద్ధికి చిరునామాగా ఉన్న ఇంద్రకరణ్ రెడ్డిపై రాజకీయ కుట్రలో భాగంగా కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. 

భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, భూములు ఆక్రమిస్తే నిరూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా అసత్య ప్రచారం మానుకోవాలని, లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో బనసపల్లి మాజీ పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి, పాకాల ఫౌండేషన్ చైర్మన్ రామచందర్, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు సత్యనారాయణ, నాలం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, రాందాస్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.