ఈ-కామర్స్ కంపెనీలకు డీసీజీఐ నోటీసులు

ఈ-కామర్స్ కంపెనీలకు డీసీజీఐ నోటీసులు

న్యూఢిల్లీ: లైసెన్సులు లేకుండా ఫార్మా ప్రొడక్టులు, డ్రగ్స్​ ఎందుకు అమ్ముతున్నారంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​తోపాటు20 ఈ–కామర్స్​ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. లైసెన్స్ లేకుండా ఆన్‌‌లైన్‌‌లో మందుల అమ్మకాలను నిషేధిస్తూ  2018 డిసెంబరు 12న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను డీసీజీఐ  సోమానీ షోకాజ్ నోటీసులో ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలను పాటించాలని తాము చాలాసార్లు అన్ని రాష్ట్రాలకు,  కేంద్రపాలిత ప్రాంతాలకు స్పష్టం చేశామని పేర్కొన్నారు.  నోటీసు జారీ చేసిన తేదీ నుండి 2 రోజులలోపు సంజాయిషీ ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్​ అమ్మినందుకు చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని అన్నారు. ఏదైనా డ్రగ్​ అమ్మకం లేదా పంపిణీ కోసం సంబంధిత రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ నుండి లైసెన్స్ తప్పనిసరని, ఇందుకు సంబంధించిన షరతులను లైసెన్స్ హోల్డర్లు పాటించాలని నోటీసు పేర్కొంది.  ఈ విషయమై ఫ్లిప్​కార్ట్ స్పోక్స్​పర్సన్​ స్పందిస్తూ తమకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుండి నోటీసును అందిందని,  తగిన విధంగా జవాబు ఇస్తామని అన్నారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును కఠినంగా అమలు చేయాలని,  ఈ–-కామర్స్ కంపెనీ మందులను విక్రయించకుండా చూడాలని సీఏఐటీ డిమాండ్ చేసింది.