
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్ పై దాడి గురించి రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని, దాడి చేసిన వారు ఖమ్మం, నిజామాబాద్ కు చెందినవాళ్లని తెలిపారు.
రామరాజ్య స్థాపన కోసం తమకు ఆర్థికంగా సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించడంతో రంగరాజన్ పై దాడి చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ’’ అని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
శుక్రవారం ( ఫిబ్రవరి 9, 2025 ) రాఘవరెడ్డి 20మంది అనుచరులతో కలిసి రంగరాజన్ ఇంటికి వెళ్లి దాడి చేసిన విషయం తెలిసిందే. అడ్డొచ్చిన ఆయన కుమారుడిపై కూడా దాడి చేశారు రాఘవరెడ్డి బ్యాచ్. దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవీ సౌందర్ రాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు పోలీసులు.
రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కొంతమంది వ్యక్తులు కోరారని.. అందుకు నిరాకరించగా సదరు వ్యక్తుల తమ కుమారుడిని తీవ్రంగా హింసించారని.. తనపైనా దాడి చేశారని రంగరాజన్ తెలిపారు. తమపై దాడికి పాల్పడ్డవారితో పాటు పరోక్షంగా వారికి సహకరించినవారిని కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు రంగరాజన్.