రేప్ బాధితురాలిని కలవనివ్వరా:స్వాతి మాలివల్

రేప్ బాధితురాలిని కలవనివ్వరా:స్వాతి మాలివల్
  • ఆస్పత్రి ఎదుట రెండో రోజు స్వాతి మాలివల్ ధర్నా

న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారి చేతిలో అత్యాచారానికి గురై ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న మైనర్‌‌ బాలిక(17)ను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంపై ఢిల్లీ మహిళా కమిషన్‌‌(డీసీడబ్ల్యూ) చీఫ్‌‌ స్వాతి మాలివల్ ఫైర్ అయ్యారు. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ బాధితురాలికి చికిత్స అందుతున్న ఆస్పత్రి ఎదుట వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ధర్నాను కొనసాగించారు. 

“అత్యాచారానికి గురైన బాలికను చూసేందుకు నేను సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చాను. అయితే, బాధితురాలిని, ఆమె తల్లిని కలవడానికి ఢిల్లీ పోలీసులు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే ఆసుపత్రిలో రాత్రంతా నేలపైనే నిద్రించి నిరసన తెలిపాను. అయినప్పటికీ బాధితురాలిని కలవడానికి పోలీసులు నాకు ఎందుకు అనుమతించడం లేదో అర్థం కావడం లేదు. వారు ఏం దాచాలనుకుంటున్నారో తెలీడం లేదు” అని స్వాతి మాలివల్ ఆరోపించారు. 

డీసీడబ్ల్యూ చీఫ్ కామెంట్లపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ.. బాధితురాలు ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉందని తెలిపారు. బాలిక తల్లి ఎవరినీ కలవడానికి ఇష్టపడడంలేదని పేర్కొన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఢిల్లీ మ‌‌హిళా, శిశు అభివృద్ధి శాఖ‌‌లో డిప్యూటీ డైరెక్టర్‌‌గా పనిచేస్తున్న ప్రమోదయ్‌‌ ఖాకా  2020 నవంబర్‌‌ నుంచి 2021 జనవరి వరకు  బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆమె  గ‌‌ర్భం దాల్చిన‌‌ట్లు తెలియ‌‌గానే నిందితుడి భార్య ఆ బాలిక‌‌కు మెడిసిన్ ఇచ్చిన‌‌ట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.