ధరణిలో సమస్యల పరిష్కారానికి రేపే డెడ్​లైన్​

ధరణిలో సమస్యల పరిష్కారానికి రేపే డెడ్​లైన్​
  • లక్ష మందికిపైగా రైతుల అర్జీలు పెండింగ్​

హైదరాబాద్​, వెలుగు: భూ సమస్యపై ధరణి పోర్టల్​లో పెట్టుకున్న అప్లికేషన్లను అక్టోబర్​ 28 కల్లా పరిష్కరించాలని సర్కారు ఆదేశించినా టార్గెట్​ను అందుకునేలా కనిపించట్లేదు. ఇప్పటికే లక్ష మందికిపైగా రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. పట్టా భూములు నిషేధిత జాబితాలో చేరడం, అమ్మకాలు జరిపిన వ్యక్తి పేరుతోనే పట్టా పాసుపుస్తకాలు రావడం, పాసు పుస్తకాల కోసం అప్లై చేసుకున్నా అందకపోవడం, ఈసీలు రాకపోవడం లాంటి సమస్యల పరిష్కారం కలెక్టర్లకు సవాల్​గా మారింది. పోర్టల్​లో పెట్టుకున్న అర్జీలను తిరస్కరించే అవకాశం కూడా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే తిరస్కరించిన వాటిపై రైతులు రెండు, మూడు సార్లు అప్లై చేసుకున్నారు. ఒకేసారి వందలాది దరఖాస్తులు వస్తుండటంతో పూర్తిగా పరిశీలించే టైమ్​ లేకపోవడం సమస్యగా మారింది.

డీఐజీలు స్క్రూటినీ చేస్తలేరు

ధరణి పోర్టల్​ ద్వారా వచ్చిన అప్లికేషన్లను పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించినా వారిపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల డీఐజీల అబ్జర్వేషన్​ ఉండేది. పని ఒత్తిడి, ఇతరత్రా కారణాలతో రైతుల సమస్యలను సరిగ్గా పరిష్కరించలేకపోతే వాటిని డిప్యూటీ ఇన్​స్పెక్టర్​ జనరల్​ (డీఐజీ), ఏఐజీలు మళ్లీ పరిశీలించేవాళ్లు. అయితే డీఐజీ, ఏఐజీలు పది రోజులుగా స్క్రూటినీ చేయడం లేదు. పరిశీలన, పరిష్కారం, తిరస్కరణ పనులన్నీ కలెక్టర్లే చూస్తున్నారు. దీని వల్ల సమస్యకు సరిగ్గా పరిష్కారం దొరక్క రైతులే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధరణి ద్వారా వచ్చిన సమస్యల ఫిర్యాదుల పరిష్కారం ఒకట్రెండు రోజుల్లో తేలే విషయం కాదని రిజిస్ట్రేషన్​ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. టెక్నికల్​ సమస్యలనేవి తరచూ వస్తుంటాయని, అవి ఒక్కరోజులో పరిష్కారమవ్వొచ్చు.. కాకపోవచ్చని అన్నారు.

కబ్జా చేస్తే తప్పించుకోలేరు

సర్కారు స్వాధీనంలోని భూముల కబ్జాలు, నాలాల ఆక్రమణలే ఇప్పుడొస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఎవరైనా సర్కారు భూమి లేదా నిషేధిత జాబితాలోని భూమిని కబ్జా చేస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది. ఆక్రమణదారులు  తప్పించుకోలేరు... సంతోష్​ మందల, స్టాంప్స్​​అండ్​ రిజిస్ట్రేషన్ ​​ఏఐజీ