ఆ రేపిస్టులను ఉరి తీయాలి: మణిపూర్ సీఎం డిమాండ్

ఆ రేపిస్టులను ఉరి తీయాలి: మణిపూర్ సీఎం డిమాండ్

మణిపూర్ ఘటనను సీఎం బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడం అమానుషం, బాధాకరం అన్నారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఈ దారణ ఘటన వెలుగు చూసిన వెంటనే ప్రభుత్వం సుమోటాగా గుర్తించిందన్నారు. ఇద్దరు  మహిళలపై అమానుష ఘటన తనను కలచివేసిందని.. బాధితుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. 

మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘సోషల్ మీడియాలో వీడియోను చూశాను. ఇలాంటి ఘటనలు మానవత్వానికి మాయని మచ్చ.. నేను చాలా బాధపడ్డాను. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించాను. నిందితులకు మరణశిక్ష పడేలా కృషి చేస్తుంది.. ఇలాంటి ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని’’ సీఎం బీరేన్ సింగ్  పిలుపునిచ్చారు. 

ఈ ఘటనపై మణిపూర్ ఘటనపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. తౌబల్ జిల్లాకు చెందిన హోరదాస్(32)ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారిస్తున్నారు.  మే 4న కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఈ ఘటన మణిపూర్‌లోని కొండ ప్రాంతాలలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన బయటపడింది.

మణిపూర్‌ సంఘటనపై కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఇద్దరు మణిపూర్ మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వైరల్ వీడియోను షేర్ చేయవద్దని ట్విట్టర్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం తప్పనిసరి అని ప్రభుత్వం నొక్కి చెప్పింది.

మరోవపై మణిపూర్ ఘటనపై  సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన సుప్రీం కేసును సుమోటోగా తీసుకుంది.   ఈ  ఘటన చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలపై ఇలాంటి ఘటన రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోకుంటే తాము  తీసుకుంటామని చెప్పింది.