వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి.. 10కి చేరిన మృతుల సంఖ్య

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరో కార్మికుడు మృతి.. 10కి చేరిన మృతుల సంఖ్య

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో సూరిబాబు అనే మరో కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సూరిబాబు సెవెన్ హిల్స్ హాస్పిటల్‎లో చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో శనివారం (జూన్ 13) కన్నుమూశాడు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల సంఖ్య పదికి చేరింది. మృతుడు సూరిబాబుకు భార్య, ఇద్దరు పిల్లలు. భార్య పిల్లలతో కలిసి పెదగంట్యాడ మండలం సీతానగరం గ్రామంలో నివాసం ఉంటున్నారు.  సూరిబాబు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

అసలేం జరిగిందంటే..?

వైజాగ్ స్టీల్ ప్లాంట్లో 2026, జూన్ 8న ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్లాంట్లోని SMS-2 విభాగంలో మరుగుతున్న లిక్విడ్ ఉక్కును తరలిస్తున్న సమయంలో మోల్టెన్ మెటల్ లాడెల్కు సంబంధించిన బకెట్లు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భారీ మొత్తంలో లిక్విడ్ ఉక్కు ప్రమాదవశాత్తూ.. అక్కడ డ్యూటీలో ఉన్న కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో సుమారు 8 మందికి పైగా మృతి చెందారు. వేడి వేడి ఉక్కు మీద పడటంతో మృతదేహాలు కాలి బూడిదైపోయినట్లు తెలిసింది.

►ALSO READ | తిరుమలలో వీకెండ్ రష్.. ఉచిత దర్శనానికి 24 గంటలు..

మరికొందరు గాయపడగా.. అధికారులు వెంటనే ప్లాంట్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం అనంతరం ఘటనా స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అత్యవసరంగా అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సాంకేతిక లోపమా, నిర్వహణలో నిర్లక్ష్యమా అనే కోణాల్లో అధికారులు విచారణ చేస్తున్నారు.