ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు శనివారం ( ఆగస్టు 1 ) ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టును సుమారు రూ.4 వేల 727 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఎయిర్ పోర్టును కేవలం 31 నెలల్లోనే పూర్తి చేయడం విశేషం. అనుకున్న సమయానికంటే 5 నెలలు ముందుగానే ఈ నిర్మాణం పూర్తయ్యింది. భోగాపురం ఎయిర్ పోర్టు ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రపంచస్థాయి రన్ వే, విశాలమైన ప్రాంగణం:
భోగాపురం ఎయిర్ పోర్ట్ దాదాపు 2 వేల 703 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఎయిర్ పోర్ట్ కోసం 2వేల 203 ఎకరాలు, ఏవియేషన్ హబ్ కోసం 500 ఎకరాలు, ఏవియేషన్ యూనివర్సిటీ కోసం మరో 136 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. 3వేల 800 మీటర్ల కోడ్ ఈ రన్ వే భోగాపురం ఎయిర్ పోర్టుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ రన్ వేపై బోయింగ్ 777, బోయింగ్ 787 డీమర్న్, ఎయిర్ బస్ A 330 వంటి భారీ విమానాలు సులభంగా ల్యాండ్ అవుతాయి.
ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు
దేశంలో అత్యంత వేగంగా పూర్తైన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్స్ లో భోగాపురం ఒకటిగా నిలిచింది. ఈ ఎయిర్ పోర్ట్ ను GMR గ్రూప్ అనుబంధ సంస్థ జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ PPPమోడల్ లో నిర్మించింది. ఇప్పటికే ఈ విమానాశ్రయం ద్వారా ఏటా 60 లక్షల మంది [ప్రయాణించేలా రూపొందించారు . భవిష్యత్తులో దీనిని 4 కోట్ల మంది సామర్థ్యానికి పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.
ప్యాసెంజర్లకు డిజిటల్ ఎక్స్ పీరియన్స్:
ప్యాసెంజర్ల కోసం ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లో అత్యాధునిక డిజిటల్ ఎక్స్ పీరియన్స్ అందించేలా రూపొందించారు. ప్రయాణికులు ఫ్లైట్ ఎక్కేవరకు, ల్యాండ్ అయినవారు ఎగ్జిట్ అయ్యేవరకు అధునాతన టెక్నాలజీతో వేగంగా మార్చబోతున్నారు.ఇందుకు గాను కాంటాక్ట్ బోర్డింగ్ బ్రిడ్జిలు,సర్వెలెన్స్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ ఏర్పాటు చేశారు.
అతిపెద్ద కార్గో హబ్
రాష్ట్రంలో ఎగుమతి రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏటా 25వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో టర్మినల్ ను ఎయిర్ పోర్టులో సిద్ధం చేశారు. దీని ద్వారా సముద్ర ఉత్పత్తులు, ఫార్మా, త్వరగా పాడైపోయే వస్తువుల కోసం కోల్డ్ చైన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు.విశాఖ ఎయిర్ పోర్టు, ప్రధాన పారిశ్రామిక కారిడార్లతో అనుసంధానం వల్ల భోగాపురం ఎయిర్ పోర్ట్ తూర్పు తీరంలో అతిపెద్ద లాజిస్టిక్ హబ్ గా మారనుంది.
