ఆస్తి కోసం తల్లిని.. బంగారం కోసం వదినను.. జనగామ, నిజామాబాద్‌‌ జిల్లాల్లో దారుణ హత్యలు

ఆస్తి కోసం తల్లిని.. బంగారం కోసం వదినను.. జనగామ, నిజామాబాద్‌‌ జిల్లాల్లో దారుణ హత్యలు

పాలకుర్తి / బోధన్, వెలుగు: ఆస్తి కోసం భర్తతో కలిసి కన్నతల్లిని మొఖంపై దిండుతో అదిమి చంపేసింది ఓ బిడ్డ. బంగారం, డబ్బుల కోసం భార్య, కొడుకుతో కలిసి వృద్ధాప్యంలో ఉన్న సొంత వదినను గొంతు నులిమి చంపేశాడు ఓ మరిది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం, నిజామాబాద్ జిల్లా సాలూరలో ఈ దారుణాలు జరిగాయి.

జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్ద తండా(కె)కు చెందిన బాదావత్ లక్ష్మి(45) భర్త 20 ఏండ్ల క్రితం చనిపోయాడు. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురు సంగీతను పెంచి పెద్ద చేసింది. ఐదేండ్ల క్రితం శాతాపురం గ్రామానికి చెందిన భూక్య వీరన్నను ప్రేమించానని కూతురు చెప్పగా తనకున్న మూడెకరాల పది గుంటల భూమిలో రెండు ఎకరాలు అమ్మి కట్న కానుకలు ఇచ్చి పెండ్లి చేసింది. ఆడపడుచులకు 20 గుంటలు రాసి ఇచ్చింది.మిగిలిన 30 గుంటల భూమిని మాత్రం తన పేరుమీద ఉంచుకుంది.

 అప్పటినుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటూ గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ కాలం వెళ్ళదీస్తోంది. అయితే, లక్ష్మి పేరిట ఉన్న భూమిని తమ పేరున రాసివ్వాలంటూ కూతురు సంగీత, అల్లుడు వీరన్న కొంతకాలంగా వేధించారు. పలుమార్లు గొడవలకు కూడా దిగారు. తాను బ్రతికున్నంతకాలం భూమి ఇచ్చేది లేదని తన తదనంతరం వారికే చెందుతుందని లక్ష్మి తేల్చి చెప్పింది. 

దీంతో కక్ష్య పెంచుకున్న కూతురు, అల్లుడు మంగళవారం (సెప్టెంబర్ 09) అర్ధరాత్రి ఇంటికి వచ్చి నిద్రలో ఉన్న లక్ష్మి మొఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపారు. బుధవారం ఉదయం లక్ష్మిని కూలీ పనికి పిలిచేందుకు చుట్టుపక్కన ఉండే మహిళలు వెళ్ళగా మెడపై గాయాలతో అనుమానాస్పదంగా చనిపోయినట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  

వదినను చంపిన మరిది.. 

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా సాలూర మండల కేంద్రానికి చెందిన కట్టం నాగవ్వ(65) భర్త కొన్నేండ్ల క్రితం చనిపోయాడు. పిల్లలు లేకపోవడంతో మరిది కుటుంబంతోపాటు ఉంటోంది. అయితే, వృద్ధాప్యంలో ఉన్న నాగవ్వను పోషించడాన్ని మరిది కట్టం చిన్న గంగారాం, అతడి భార్య కళావతి, కొడుకు గణేశ్ భారంగా భావించారు. నాగవ్వను చంపేస్తే ఆమె వద్ద ఉన్న బంగారం, డబ్బులు కూడా తీసుకోవచ్చని ప్లాన్ వేశారు. మంగళవారం రాత్రి ముగ్గురూ కలిసి ఆమెను గొంతు నులిమి చంపారు. నాగవ్వ మేనల్లుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.