- వికారాబాద్ జిల్లా యాచారంలో ఘటన
వికారాబాద్, వెలుగు: ఓ వైపు అప్పులు.. మరో వైపు పెండ్లీడుకు వచ్చిన బిడ్డ.. అప్పు ఎలా తీర్చాలో, బిడ్డ పెండ్లి ఎలా చెయ్యాలో తెలియక సతమతమవుతున్న దంపతులు రందితోనే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన నక్కలి దశరథం(58), లక్ష్మి(54) శనివారం ఉదయం పొలానికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. రాత్రి ఇంట్లో ఉన్న చిన్న కూతురు సురేఖతో కలిసి భోజనం చేశారు. భోజనం అనంతరం అప్పుల భారం, కూతురు పెళ్లి విషయంపై మాట్లాడుకున్నారు.
కొద్దిసేపటికే దశరథం ఒక్కసారిగా కుప్పకూలగా, వెంటనే లక్ష్మి కూడా కింద పడిపోయింది. సురేఖ ఇరుగుపొరుగు వారిని పిలిచింది. స్థానికులు వచ్చేసరికి ఇద్దరూ మృతిచెందినట్లు గుర్తించారు. అప్పుల బాధ తట్టుకోలేక వారు ఆత్మహత్య చేసుకున్నట్లు కొడుకు అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దశరథం యూనియన్ బ్యాంకులో రూ.లక్ష, లక్ష్మి బంట్వారం పీఏసీఎస్‌లో రూ.1.50 లక్షల పంట రుణంతో పాటు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.6 లక్షలకు పైగా అప్పు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దంపతుల డెడ్‌బాడీలను పోస్టుమార్టానికి పంపించినట్లు ఎస్‌ఐ విమల తెలిపారు.
