అప్పుల బాధ తట్టుకోలేక...

అప్పుల బాధ తట్టుకోలేక...

హనుమకొండలో ఒకరు, ములుగు జిల్లాలో మరొకరు

ఆత్మకూరు (దామెర)/వెంకటాపురం, వెలుగు : అప్పుల బాధతో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన హింగే వీరన్న (56) తనకున్న 4 ఎకరాలను సాగు చేసుకుంటున్నాడు. రెండేండ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో మనస్తాపానికి గురైన వీరన్న, పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలానికి వెళ్లిన వీరన్న ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులందరూ పొలంలో వెతకగా.. చనిపోయి కనిపించాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు దామెర ఎస్​ఐ హరిప్రియ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అదేవిధంగా, ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని ఉప్పెడు- గొల్లగూడెం గ్రామానికి చెందిన బక్కతట్ల వెంకన్న (45) మిర్చి పంట వేశాడు. రెండేండ్లుగా దిగుబడి సరిగా రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. 23న రాత్రి పొలంలో పురుగుల మందు తాగాడు. మరుసటి రోజు ఉదయం పొలానికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి వెంకన్నను వరంగల్​ ఎంజీఎం హాస్పిటల్​ తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో బుధవారం చనిపోయాడు. మృతుడి కూతురు రమ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.