దశాబ్ది ఉత్సవాలు సెక్రటేరియెట్ నుంచి షురూ...  రూ.105 కోట్లు కేటాయించినం : సీఎం కేసీఆర్

దశాబ్ది ఉత్సవాలు సెక్రటేరియెట్ నుంచి షురూ...  రూ.105 కోట్లు కేటాయించినం : సీఎం కేసీఆర్
  • తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా వేడుకలుండాలి
  • 21 రోజులు పండుగలా నిర్వహించాలి
  • అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం
  • రోహిణి కార్తె ప్రారంభంలోనే వరి నాట్లు వేసుకోవాలని రైతులకు సూచన

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2న సెక్రటేరియెట్ నుంచి ప్రారంభిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. 22వ తేదీ వరకు వేడుకలు కొనసాగుతాయని వివరించారు. ఈ ఉత్సవాల కోసం రూ.105 కోట్లు కేటాయిస్తున్నామని, రాష్ట్ర ఘన కీర్తిని చాటిచెప్పేలా వేడుకలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించేందుకు గురువారం సెక్రటేరియెట్​లో జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. పోరాటాలు, త్యాగాలతో ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని అట్టహాసంగా నిర్వహించాలని సూచించారు. అమరుల త్యాగాలు స్మరిస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉత్సవాలు జరపాలన్నారు. 21 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏరోజు ఏ ప్రోగ్రామ్​ చేపట్టాలో కలెక్టర్లకు సీఎం వివరించారు.

దేశంలోనే ముందంజలో ఉన్నం

‘‘ఒకనాడు గంజి కేంద్రాలు నడిచిన పాలమూరులో ఇయ్యాల పచ్చని పంటలు.. పారే వాగులతో పాలుగారే పరిస్థితి ఉన్నది. రాష్ట్రం వచ్చిన నాడు 6లక్షల టన్నుల ఎరువుల వినియోగం ఉంటే.. ఇయ్యాల 28లక్షల టన్నులకు పెరిగింది. తక్కువ టైంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించుకున్నాం. వ్యవసాయం, ఐటీ, విద్యుత్ సహా అన్ని రంగాల్లో దేశంలోనే ముందంజలో ఉన్నాం” అని కేసీఆర్ అన్నారు. విద్య, వైద్య రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించామని, నీట్, సివిల్స్ లాంటి పోటీ పరీక్షల్లో తెలంగాణ స్టూడెంట్స్ మంచి ర్యాంకులు సాధిస్తూ రాష్ట్ర ఘనకీర్తిని చాటుతున్నారన్నారు. నారాయణపేట ఎస్పీ కూతురు సివిల్ సర్వీసెస్ పరీక్షలో జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు సాధించినందున ఆమెను అభినందించారు. 21రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలను కలెక్టర్లు వీడియో రికార్డు చేయించాలని, నియోజకవర్గాల వారీగా పదేండ్ల ప్రగతి నివేదికపై పుస్తకాలు ప్రింట్ చేయించి పంపిణీ చేయాలన్నారు. అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శించాలని సూచించారు.

మార్చి 31లోపు కోతలు పూర్తి చేయాలి

ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వ్యవసాయరంగాన్ని నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో పనిచేశామని సీఎం కేసీఆర్ అన్నారు. చెరువులు బాగు చేశామని, కరెంట్, సాగునీటి రంగాలను బలోపేతం చేయడంతోనే ధాన్యం దిగుబడి 3కోట్ల టన్నులు దాటిపోయిందని వివరించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు పంటకాలాన్ని నెల ముందుకు మార్చుకోవాలని సూచించారు. ‘‘ప్రాజెక్టులతో పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉంది. మార్చి 31లోపే పూర్తి కావాల్సిన కోతలు మే నెల దాటినా కొనసాగుతున్నాయి. ఈ బాధలు తప్పాలంటే నవంబర్ 20వ తారీఖులోపు యాసంగి నాట్లు వేసుకోవాలి”అని కేసీఆర్​ సూచించారు.

వరినాట్లపై అవగాహన కల్పించాలి

వానాకాలం నాట్లు ముందుకు జరుపుకోవాలని, రోహిణి కార్తె ప్రారంభంలోనే వరినాట్లు మొదలు కావాలని కేసీఆర్​ అన్నారు. జూన్ 25 వరకు వానాకాలం నాట్లు పూర్తి చేయాలని, కలెక్టర్లు ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ‘‘నవంబర్ లో వడ్లు అలికితే చలికి నారు పెరగదనే అపోహ రైతుల్లో ఉన్నది. అది వాస్తవం కాదు. నారు పోసేటప్పుడు కాదు వరి ఈనే టైంలోనే చలి ఉండొద్దు. ఈనేటప్పుడు చలి ఉంటే తాలు ఎక్కవయితది. ఎండలు ముదరకముందే నారు బాగా వస్తది. యాసంగి నాట్లు ముందే వేస్తే తాలు తక్కువై, తూకం ఎక్కువయితది” అని కేసీఆర్​ తెలిపారు.

జూన్​ 24 నుంచి పట్టాల పంపిణీ

రాష్ట్రంలోని 2,845 ఆదివాసీ గూడాలు, తండాల పరిధిలో 1,50,224 మంది గిరిజనుల ఆధీనంలో ఉన్న 4,01,405 ఎకరాల పోడు భూములకు జూన్ 24 నుంచి 30 వరకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతీ లబ్ధిదారుడితో బ్యాంకు అకౌంట్లు తెరిపించాలని, ఆ ఖాతాల్లోనే రైతుబంధు సాయం జమ చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందని బీసీ, ఎంబీసీ కులాల వారికి జూన్ 9న నిర్వహించే సంక్షేమ సంబురాల్లో రూ.లక్ష ఆర్థిక సాయం అందజేయాలని సూచించారు. నియోజకవర్గానికి 1,10‌‌‌‌‌‌‌‌0 మందికి దళితబంధు సాయం అందజేయాలని తెలిపారు. గొర్రెల పంపిణీని దశాలవారీగా అమలు చేయాలని సూచించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ సఫాయి కార్మికులను గుర్తించి అవార్డులు అందజేయాలన్నారు. సమావేశంలో మంత్రులు, పోలీస్ కమిషనర్​లు, ఎస్పీలు, 24 శాఖల సెక్రటరీలు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.