మన చరిత్ర, సంస్కృతిని మరవద్దు : డెక్కన్‌‌ హెరిటేజ్‌‌ అకాడమీ ట్రస్టు చైర్మన్‌‌ వేదకుమార్‌‌

మన చరిత్ర, సంస్కృతిని మరవద్దు : డెక్కన్‌‌ హెరిటేజ్‌‌ అకాడమీ ట్రస్టు చైర్మన్‌‌ వేదకుమార్‌‌

బషీర్​బాగ్, వెలుగు: చారిత్రక కట్టడాలు, ప్రదేశాలను చూడడమే కాకుండా వాటి వెనుక ఉన్న నైపుణ్యత, సాంకేతికతను తెలుసుకోవాలని డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్టు చైర్మన్ వేదకుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మ్యూజియం డే సందర్భంగా డెక్కన్‌‌ హెరిటేజ్‌‌ అకాడమీ ట్రస్టు, రాష్ట్ర హెరిటేజ్‌‌ డిపార్టుమెంట్‌‌, సివిల్‌‌ సొసైటీ గ్రూప్‌‌ సంయుక్త ఆధ్వర్యంలో అబిడ్స్ గన్‌‌ఫౌండ్రీలోని సెంటినరీ హెరిటేజ్‌‌ మ్యూజియంలో ఆదివారం వేడుకలు నిర్వహించారు.

మ్యూజియంలో ఉన్న పురాతన వస్తువులు, హస్త కళలాలపై స్కూల్‌‌ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎంత సాఫ్ట్‌‌వేర్‌‌ రంగంలోకి వెళ్లినా మన చరిత్ర, సంస్కృతిని మరవద్దని వేద కుమార్ తెలిపారు. కుతుబ్‌‌షాహి, ఆసఫ్‌‌జాహి కాలంలో మ్యూజియంలకు ప్రాముఖ్యత ఇచ్చారని, సాలార్‌‌జంగ్ మ్యూజియం ప్రపంచంలో గొప్పదని పేర్కొన్నారు. బోధన్, కామారెడ్డి ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి చారిత్రక కట్టడాల గురించి తెలుసుకొని ఒక ప్రాజెక్టు రూపొందించినట్లు తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేసి , ఆ జిల్లా చరిత్రను ప్రజలకు తెలియజేయాలని, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.