పరిధి దాటితే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు

పరిధి దాటితే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదు
  • ఉన్నత స్థాయి వ్యక్తులపై అభాండాలు వేయడం పరిపాటైంది    
  • రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కుదరదు
  • 32 రెవెన్యూ డిస్ట్రిక్ట్‌‌‌‌ కోర్టులను కేసీఆర్‌‌‌‌తో కలిసి వర్చువల్‌‌‌‌గా ప్రారంభించిన సీజేఐ
  • కోర్టుల సంఖ్య పెంచాలి: సీఎం కేసీఆర్

హైదరాబాద్ : న్యాయవ్యవస్థపై, కోర్టు తీర్పులపై కొందరు పైశాచిక ఆనందంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ ఎన్వీ రమణ సీరియస్ అయ్యారు. న్యాయ వ్యవస్థపై పరిధికి లోబడి మాట్లాడితే ఉపేక్షిస్తామని, పరిధి దాటితే న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. న్యాయవ్యవస్థ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసేది కాదన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా పనిచేస్తోందని తెలిపారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అభాండాలు వేయడం పరిపాటి అయ్యిందని, కోర్టు తీర్పులకు, ప్రభుత్వ ఆదేశాలకు వక్రభాష్యం చెప్పడం ఎక్కువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే కుదరదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం నిలబడాలంటే న్యాయవ్యవస్థ ముఖ్యమని, న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని చెప్పారు. హైకోర్టు ఆవరణలో గురువారం రాత్రి 32 కొత్త రెవెన్యూ డిస్ట్రిక్ట్‌ కోర్టులను సీఎం కేసీఆర్‌తో కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు. తర్వాత సీజేఐ ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

కమర్షియల్ కోర్టులు పెరగాలి :
రాష్ట్రంలో న్యాయ సంస్కరణలకు సీఎం కేసీఆర్‌ చూపుతున్న చొరవను సీజేఐ కొనియాడారు. మండలాలను ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ పాలనాపరంగా పెద్ద సంస్కరణ చేపడితే.. ఇప్పుడు న్యాయపరంగా అంతటిస్థాయి సంస్కరణకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని అభినందించారు. దేశానికే తెలంగాణ న్యాయవ్యవస్థ తలమానికంగా ఉంటుందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కమర్షియల్‌ కోర్టులు 2, 1 చొప్పున మాత్రమే ఉన్నాయని, ఐటీ, ఇతర రంగాల్లో అభివృద్ధి నేపథ్యంలో వాణిజ్య కోర్టుల సంఖ్య పెరగాలన్నారు. హైకోర్టు, ఇతర కోర్టుల్లో ఐటీ సేవల్ని మరింత వినియోగంలో తేవాలని హైకోర్టు సీజేకి విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లా కోర్టుల సంఖ్య పెంపు వల్ల సత్వర న్యాయం జరుగుతుందని, జిల్లాల్లోని కేసుల పెండింగ్‌ భారం తగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని హైకోర్టుల్లో 155 మంది జడ్జిలను నియమిస్తే అందులో 33 మంది మహిళలున్నారని, సుప్రీంకోర్టులో కూడా పెద్ద సంఖ్యలో జడ్జిల ఖాళీలను తన హయాంలోనే భర్తీ చేసినట్లు చెప్పారు.
 


అన్ని రంగాల్లో దూసుకుపోతున్నం: కేసీఆర్
రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు 32 జ్యుడీషియల్‌ జిల్లాలు ఏర్పాటు కావడంపై సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. తలసరి ఆదాయం, ఐటీ, జీఎస్‌డీపీ, వ్యవసాయం, పరిశ్రమలు సహా అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతున్నదని చెప్పారు. హైకోర్టు జడ్జిల సంఖ్య పెంచడంపై సీజేఐకి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కోర్టుల ఏర్పాటుతో ప్రజలకు సత్వర న్యాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టు, రంగారెడ్డి కోర్టుల విభజనకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ చొరవ చూపాలని కోరారు. అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులు, రంగారెడ్డి కోర్టుల్లో కేసుల పెండింగ్‌ ఎక్కువగా ఉన్నట్లు తనకు సమాచారం ఉందని, కోర్టుల సంఖ్య పెంచితే కేసుల భారం తగ్గి సత్వర న్యాయం కక్షిదారులకు అందుతుందని చెప్పారు. ఈ దిశగా హైకోర్టు చర్యలు చేపట్టాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ ప్రసంగిస్తూ.. కొత్త జ్యుడీషియల్‌ కోర్టుల ఏర్పాటు వల్ల సత్వర న్యాయం అందుతున్నారు. న్యాయ వ్యవస్థ మరింత బలపడుతుందని చెప్పారు. న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్, జస్టిస్‌ పి.నవీన్‌రావు ప్రసంగించారు.

మరిన్ని వార్తల కోసం : -

గవర్నర్కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు


న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువ కావాలి