తెలంగాణలో మీడియాకు యాడ్స్ ​ పెరుగుతున్నయ్​

తెలంగాణలో మీడియాకు యాడ్స్ ​ పెరుగుతున్నయ్​
  • మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బెటర్
  • ప్రకటన ఖర్చులో దేశ గ్రోత్ రేట్ కన్నా ఎక్కువే

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో మీడియాకు యాడ్స్​ పెరుగుతున్నాయని మీడియా సంస్థల అధినేతలు, ప్రముఖులు పేర్కొన్నారు. మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా యాడ్స్​ తగ్గుతున్నా.. తెలంగాణలో మాత్రం పాజిటివ్​ గ్రోత్​ ఉందని అన్నారు. ప్రకటనల ఖర్చు విషయానికి సంబంధించి జాతీయ వృద్ధి రేటు 5 నుంచి 6 శాతం ఉంటే.. రాష్ట్రంలో 8 నుంచి 9 శాతం వరకు ఉన్నట్టు అంచనా వేశారు. దేశంలోని ప్రముఖ మీడియా ఔట్​సోర్సింగ్​ కంపెనీ ఫోర్త్​ డైమెన్షన్​ మీడియా ఆధ్వర్యంలో ‘డీకోడింగ్​ మీడియా ఇన్​ తెలంగాణ’ అనే అంశంపై మంగళవారం ఇ–కాన్​క్లేవ్​ నిర్వహించారు. ఈ సదస్సుకు వీ6 సహకారం అందించగా, వెలుగు దినపత్రిక కో స్పాన్సర్​గా వ్యవహరించింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మీడియా వినియోగంలో ఆంధ్రప్రదేశ్​తో పోలిస్తే తెలంగాణ పూర్తి భిన్నంగా ఉందని మీడియా ప్రముఖులు అన్నారు. తెలంగాణను ఏపీతో కలిపి ప్రస్తావించడం లేదని, ఇప్పుడు మీడియా విషయంలో, ప్రకటనల విషయంలో రాష్ట్రానిది ప్రత్యేక స్థానమన్నారు. ప్రజలు, పరిశ్రమలను ఇటీవల బాగా ఆకర్షించిన అంశాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. ఈ చర్చలో విల్​ మీడియా (వీ6 వెలుగు) డైరెక్టర్​ వైష్ణవి గడ్డం, ఓఎంజీ మీడియా గ్రూప్​ సౌత్​ ఏషియా సీఈవో కార్తీక్​ శర్మ, టామ్​ మీడియా రీసెర్చ్​ సీఈవో ఎల్వీ కృష్ణన్​, ఘంట ఫుడ్స్​(బాంబినో) సేల్స్​ అండ్​ మార్కెటింగ్​ హెడ్​ ధీరజ్​ నాయుడు, వర్మిలియన్​ కమ్యూనికేషన్​ మీడియా హెడ్​ సురభి గుప్తా, పెన్నా సిమెంట్స్ మార్కెటింగ్​ కమ్యూనికేషన్స్​ హెడ్​ జాకబ్​ మాథ్యూ, వేవ్​ మేకర్​ చీఫ్​ క్లైంట్​ ఆఫీసర్​ శేఖర్​ బెనర్జీ మాట్లాడారు. స్టార్​ మా యాడ్​ సేల్స్​ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ అనురాధ మధు అగర్వాల్​ ప్యానలిస్ట్​గా వ్యవహరించారు.