- కేంద్రం నిర్ణయంపై వీసా ఆందోళన
- తగ్గిపోతున్న డెబిట్‌కార్డుల సంఖ్య
ఎలక్ట్రానిక్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు డెబిట్‌కార్డులను తగ్గించడానికి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలపై గ్లోబల్ కార్డు పేమెంట్స్ గ్రూప్ వీసా ఆందోళన వ్యక్తం చేసింది. దీని అమలు వల్ల పేమెంట్ గేట్‌వే కంపెనీలకు, బ్యాంకులకు ఎన్నో సమస్యలు ఉంటాయని తెలిపింది. బ్యాంక్‌లు, కార్డు పేమెంట్ నెట్‌వర్క్‌లు నో ఫీ డెబిట్‌కార్డు ట్రాన్సాక్షన్స్ ఆఫర్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమలు చేయడం చాలా కష్టమని వీసా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. రూ.50 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారులు డెబిట్‌కార్డులపై, ఇతర డిజిటల్ మార్గాల లావాదేవీలపై(క్రెడిట్ కార్డులు మినహాయించి) మర్చంట్ డిస్కౌంట్ రేటు చెల్లించాల్సిన అవసరం లేదని గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ డిస్కౌంట్ రేటును డిజిటల్ లావాదేవీలు జరిపినందుకు గాను బ్యాంక్‌లకు, కార్డు పేమెంట్ నెట్‌వర్క్‌లకు, ఇతర ఫైనాన్సియల్ ఇంటర్‌మీడియేటర్స్‌కు మర్చంట్ చెల్లిస్తాడని కేంద్ర ఆర్థికశాఖ వివరణ ఇచ్చింది.
ట్రాన్సాక్షన్ ఫీజుపై 0.40–0.80 శాతం…
డెబిట్‌కార్డుల లావాదేవీ విలువలో 0.40 శాతం నుంచి 0.80 శాతం వరకు ట్రాన్సాక్షన్ చార్జీ వసూలు చేస్తున్నారు. ట్రాన్సాక్షన్ చార్జీలను రద్దు చేయడం సాధ్యం కాదని వీసా ఇండియా, సౌతాసియా హెడ్ టీఆర్ రామచంద్రన్ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ ప్యానల్ భేటీలో అన్నారు. ఎలక్ట్రానిక్ పేమెంట్స్ మెకానిజం ద్వారా ఒకవేళ ప్రభుత్వం, మర్చంట్, కన్జూమర్ అందరూ నగదుపై ఖర్చును పొదుపు చేయాలనుకుంటే.. స్టేక్‌హోల్డర్స్ అందరికీ పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. రామచంద్రన్ వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించలేదు. ప్రజలు డిజిటల్ పేమెంట్లలోకి మారేందుకు క్యాష్ హ్యాండ్లింగ్‌ను తగ్గించేందుకు ఆర్‌బీఐ, బ్యాంక్‌లు ఖర్చులను భరించనున్నాయని బడ్జెట్ స్పీచ్‌లో నిర్మలా సీతారామన్ అన్నారు. ఇప్పటికే 150 బిలియన్ డాలర్ల మొండి బకాయిల సమస్యతో తర్జన భర్జన అవుతున్న బ్యాంక్‌లు డెబిట్‌కార్డుల ట్రాన్సాక్షన్స్ వసూలు చేయకుంటే మరింత నష్టపోతాయని సంబంధిత ఆఫీసర్లు చెబుతున్నారు.
తగ్గిపోయిన డెబిట్‌కార్డులు..
ఈ ఏడాది మే వరకు సర్క్యూలేషన్‌లో ఉన్న డెబిట్‌కార్డులు 82.49 కోట్లు కాగా.. క్రెడిట్ కార్డులు 4.89 కోట్లు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ డేటాలో వెల్లడించింది. ఏటా డెబిట్‌కార్డుల సంఖ్య కూడా తగ్గిపోతూనే ఉందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. మార్చి నుంచి మే మధ్య కాలంలోనే సర్క్యులేషన్‌లోని డెబిట్‌కార్డులు సంఖ్య 10 కోట్లకు చేరింది. అంటే 92.4 కోట్ల నుంచి 82.49 కోట్లకు దిగొచ్చాయి. మరోవైపు డెబిట్‌కార్డుల జర్నీ ముగిస్తామంటూ దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ చెబుతోంది. మరిన్ని డిజిటల్ పేమెంట్స్ సొల్యూషన్స్‌ను అందిస్తూ.. డెబిట్‌కార్డుల వాడకాన్ని పూర్తిగా తొలగిస్తామని ఎస్‌బీఐ ఛైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. అయితే ఎస్‌బీఐ కస్టమర్లలో ఎక్కువ మంది డెబిట్ కార్డు లావాదేవీలపైనే ఆధారపడుతున్నారు. డెబిట్‌కార్డులను తొలగించడానికి ఎస్‌బీఐ యోనోను వాడుతోంది. యోనో ద్వారానే క్యాష్ విత్‌డ్రాయల్ చేపట్టే ప్రక్రియను ప్రారంభించింది.
