గోల్డ్ కు తగ్గుతున్న వాల్యూ.. క్రిప్టోకరెన్సీకి పెరుగుతున్న ఆదరణ

గోల్డ్ కు తగ్గుతున్న వాల్యూ.. క్రిప్టోకరెన్సీకి పెరుగుతున్న ఆదరణ

బంగారానికి సవాల్ విసురుతున్న బిట్‌‌కాయిన్‌‌

డిజిటల్‌‌ కరెన్సీ ఫండ్స్‌‌లో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు

గోల్డ్‌‌కు వాల్యూ తగ్గుతుందంటున్న నిపుణులు

బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు:గత కొన్ని నెలల నుంచి చూస్తే గోల్డ్‌‌ ధరలు పెరుగుతున్నట్టే  బిట్‌‌కాయిన్‌‌  వాల్యూ కూడా ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ ధర 1,841.65 డాలర్ల వద్ద ట్రేడవుతుంటే, ఒక బిట్‌‌కాయిన్‌‌ వాల్యూ 18,202 డాలర్లకు చేరుకుంది.  కరోనా సంక్షోభంతో బిట్‌‌కాయిన్‌‌ వాల్యూ మరింత పెరిగింది. మరి ఫ్యూచర్‌‌‌‌లో గోల్డ్‌‌ ఇన్వెస్టర్లు బిట్‌‌కాయిన్‌‌ వైపు షిఫ్ట్‌‌ అవుతారా? అంటే అయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గోల్డ్‌‌ను హెడ్జ్‌‌ఫండ్‌‌గా ఇన్వెస్టర్లు చూస్తారు. అంటే ఇన్వెస్ట్‌‌మెంట్‌‌లో ఎక్కువ నష్టపోకుండా బంగారంలో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. గత కొన్నేళ్ల నుంచి   బిట్‌‌కాయిన్‌‌పై కూడా ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరుగుతోంది. నిజం చెప్పాలంటే గోల్డ్‌‌కు, బిట్‌‌కాయిన్‌‌కు కొన్ని పోలికలు కనిపిస్తాయి. గోల్డ్‌‌ను  ఎక్కువ కాలం దాచుకోవచ్చు.  ఈ విలువైన లోహం కాయిన్స్‌‌ లేదా బార్స్‌‌ లలో ఎలాగున్నా ఒకే విలువ వస్తుంది.

రూల్స్‌‌ ప్రకారం గోల్డ్‌‌ను ఎక్కడికైనా ట్రాన్స్‌‌పోర్ట్‌‌ చేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైందేంటంటే గోల్డ్‌‌ను ఈజీగా పొందలేం. కరెన్సీలను ప్రింట్‌ చేసుకోవచ్చు. కానీ గోల్డ్‌ నిల్వలు లిమిటెడ్‌గా ఉంటాయి. అందుకే గోల్డ్‌‌ వాల్యూ టైమ్‌‌ బట్టి పెరుగుతుందే తప్ప తగ్గదని ఇన్వెస్టర్లు, వివిధ దేశాల సెంట్రల్‌‌ బ్యాంకులు నమ్ముతుంటాయి. మరోవైపు బిట్‌‌కాయిన్‌‌ను కూడా ఎక్కడికైనా ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌ చేయొచ్చు. దీనిని పొందడం కూడా అంత ఈజీ కాదు.

ఒక బిట్‌‌కాయిన్‌‌ క్రియేట్‌‌ చేయాలంటే  వేల అలాగారిథమ్‌‌లను పరిష్కరించాల్సి ఉంటుంది. వీటిని కూడా సాధారణ కంప్యూటర్లతో క్రియేట్ చేయడం అసాధ్యం. గోల్డ్‌‌ మాదిరిగానే సిల్వర్‌‌‌‌, ప్లాటినమ్‌‌ వంటి ఇతర మెటల్స్‌‌ కూడా ఉన్నాయి. అలానే బిట్‌‌కాయిన్‌‌కి బదులుగా ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ గోల్డ్‌కు, బిట్‌కాయిన్‌కు ఉన్న ప్రధానమైన అడ్వాంటేజ్‌.. వీటిపై ఇన్వెస్టర్లలో నమ్మకం ఎక్కువగా ఉండమే. గోల్డ్‌‌తో పొలిస్తే  బిట్‌‌కాయిన్‌‌కు ఎక్కువ అడ్వాంటేజిలున్నాయనే చెప్పొచ్చు. ప్రస్తుత డిజిటల్ వరల్డ్‌‌లో  ఫిజికల్‌‌ గోల్డ్‌‌ కంటే డిజిటల్‌‌ కరెన్సీల(బిట్‌‌కాయిన్‌‌)కు  ఇన్వెస్టర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.

బిట్‌‌కాయిన్‌‌తో గోల్డ్‌‌ ధర తగ్గుతది..

క్రిప్టోకరెన్సీలకు  ఆదరణ పెరుగుతుండడం గోల్డ్‌‌పై ప్రభావం చూపుతుందని ఫైనాన్షియల్ కంపెనీ జేపీ మోర్గాన్‌‌ చేజ్‌‌ అండ్ కో పేర్కొంది.  ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ నుంచి బిట్‌‌కాయిన్ ఫండ్స్‌‌లోకి డబ్బులొస్తున్నాయని, ఈ ట్రెండ్‌‌ లాంగ్‌‌ టర్మ్‌‌లో గోల్డ్‌‌ ధరలు తగ్గడానికి కారణమవుతుందని తెలిపింది. మరికొన్నేళ్లలో ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఇన్వెస్టర్ల  క్రిప్టోకరెన్సీ కొనుగోళ్లు పెరుగుతాయని అంచనావేసింది. డిజిటల్‌‌ కరెన్సీలు పాపులర్‌‌ అవుతుండడంతో గోల్డ్‌‌ నుంచి  క్రిప్టోకరెన్సీల వైపు ఇన్వెస్టర్లు షిఫ్ట్ అవుతారని తెలిపింది. ఈ ట్రెండ్‌‌ కొనసాగితే గోల్డ్‌‌ మార్కెట్లో బుల్స్‌‌గా కొనసాగుతున్న ఇన్వెస్టర్లు ఎక్కువగా నష్టపోతారని, గోల్డ్‌‌ నుంచి కొద్ది మొత్తంలో ఫండ్స్‌‌ క్రిప్టోలవైపు వెళ్లినా గోల్డ్‌‌ ధరలు పడిపోతాయని అంచనావేసింది.  బిట్‌‌కాయిన్‌‌కు ఇన్‌‌స్టిట్యూషనల్‌‌ ఇన్వెస్టర్లు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారని, అదే గోల్డ్‌‌ను ఎప్పుటి నుంచో వీరు ఫాలో అవుతున్నారని పేర్కొంది. గ్లోబల్‌‌గా ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ తర్వాత బిట్‌‌కాయిన్‌‌ ఫండ్స్‌‌లోకి 2 బిలియన్‌‌ డాలర్ల ఇన్‌‌ఫ్లోస్ వచ్చాయని, అదే గోల్డ్‌‌ ఈటీఎఫ్‌‌ల నుంచి 7 బిలియన్‌‌ డాలర్లు బయటకొచ్చాయని పేర్కొంది. ప్రస్తుతం గోల్డ్‌‌ ఈటీఎఫ్‌‌లలో 3.3 % బిట్​కాయిన్​లో 0.18 % హౌస్‌‌హోల్డ్స్​ ఇన్వెస్ట్ చేస్తున్నాయి.

డిజిటల్‌‌ కరెన్సీ తెస్తున్న చైనా..

 

ఈ ఏడాది కరోనా సంక్షోభంతో సెంట్రల్‌‌‌‌ బ్యాంకుల గోల్డ్‌‌‌‌ కొనుగోళ్లు పెరిగాయనే చెప్పొచ్చు. ఇండియా, అమెరికా, రష్యా, చైనా దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్‌‌‌‌ను ఎక్కువగా కొనుగోలు చేశాయి. ఫైనాన్షియల్‌‌‌‌ సంస్థ ఫిన్‌‌‌‌బోల్డ్ విడుదల చేసిన డేటా ప్రకారం ఈ నాలుగు దేశాలు ఈ ఏడాది మార్చి–నవంబర్ నాటికి 208.34 టన్నుల గోల్డ్‌‌‌‌ను సేకరించాయి. కాగా, గత కొన్నేళ్ల నుంచి చైనా సెంట్రల్‌‌‌‌ బ్యాంక్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ను ఎక్కువగా కొంటోందని ఎనలిస్టులు అంటున్నారు. యువాన్‌‌‌‌ను డిజిటల్‌‌‌‌గా తేవడానికి చైనా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కరెన్సీకి మద్ధతుగా గోల్డ్‌‌‌‌ను ఈ దేశ సెంట్రల్‌‌‌‌ బ్యాంక్ సేకరిస్తోందని అంటున్నారు. ఇది ఇంటర్నేషనల్‌‌‌‌ మార్కెట్లో డిజిటల్‌‌‌‌ యువాన్‌‌‌‌పై నమ్మకం పెరగడానికి సాయపడుతుందని చెబుతున్నారు. అలానే ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌, ట్విటర్ లాంటి కంపెనీలు కూడా సొంత క్రిప్టోకరెన్సీలను తీసుకురావాలని ప్లాన్స్‌‌‌‌ వేస్తున్నాయి.