- మూడేండ్ల పాటు ఎలక్ట్రికల్ డీఈఈగా పంపిస్తూ ఏపీ ఉత్తర్వులు
- గత డిసెంబర్ లో ఎస్పీడీసీఎల్ నుంచి కూడా ఏపీకి లెటర్
- ఉత్తర్వులపై విద్యుత్ శాఖలో దుమారం
- ఆంధ్రా నుంచి ఉద్యోగులను తెలంగాణలో నియమించడంపై విమర్శలు
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రా నుంచి డిప్యూటేషన్‌పై ఓ ఉద్యోగిని తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేశారు. స్వయంగా ఆ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ద్వారా అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ జెన్కో నుంచి రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో మూడేండ్ల పాటు పనిచేసేలా డీఈఈని బదిలీ చేస్తూ జీవో జారీ చేశారు.
ఇప్పుడీ విషయం రాష్ట్రంలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర విద్యుత్ శాఖలో జరుగుతున్న వింత పోకడలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ డిప్యూటేషన్ వెనకాల ఎవరు చక్రం తిప్పి ఉంటారు? దీని వెనకాల ఉన్న షాడో ఎవరు? అంటూ ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. ఆంధ్రా నుంచి ఉద్యోగులను తెలంగాణలో నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగం ఇక్కడ.. జీతం అక్కడ!
ఏపీ జెన్కో సంస్థ పరిధిలోని విజయవాడలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్( డీఈఈ) జేవీ దుర్గారావును అక్కడి రాష్ట్ర ప్రభుత్వం మూడేండ్ల పాటు డిప్యూటేషన్ పై తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ఈ నెల 20న జీవో నంబర్.20 రిలీజ్చేశారు. దీనికంటే ముందుగా ఈ డిప్యూటేషన్ విషయమై గతేడాది డిసెంబర్ 22న ఎస్పీడీసీఎల్సీఎండీ ఆఫీస్ నుంచి ఏపీ ప్రభుత్వానికి లెటర్నంబర్ సీఈ, పీవో–బీ/జేఏ/52/25 పంపించారు.
ఆ తర్వాతే అక్కడి ప్రభుత్వం ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్‌పై నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డిప్యూటేషన్‌పై ఇక్కడికి బదిలీ చేసిన డీఈఈ దుర్గారావు ఇక్కడ విధుల్లో జాయిన్అయితే పనిచేసేది తెలంగాణలో.. జీతం తీసుకునేది ఏపీలో అని ఉద్యోగులు చెబుతున్నారు.
జాయిన్ చేసుకుంటారా? రిజెక్ట్ చేస్తారా?
ఏపీ నుంచి తెలంగాణకు డిప్యూటేషన్‌పై బదిలీ అయిన ఉద్యోగిని ఇక్కడి ప్రభుత్వం ఒప్పుకుంటుందా? లేక రిజెక్ట్ చేస్తుందా? అనే విషయం కొద్ది రోజుల్లో తేలనుంది. ఇంటర్ స్టేట్ డిప్యూటేషన్‌పై ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన జీవోపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఈ బదిలీ ఉన్నతస్థాయి అధికారుల వల్ల కూడా జరగదని.. ప్రభుత్వ పెద్దలలో ఎవరో ఒకరు జోక్యం చేసుకుంటేనే ఇది సాధ్యం అయిందని అంటున్నారు. ఆంధ్రా నుంచి వచ్చిన డిప్యూటేషన్ల విషయమై రాష్ట్రంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ ఉద్యోగిని ఇక్కడ జాయిన్ చేసుకుంటారా? లేదా? అనే విషయం త్వరలోనే తేలనున్నది.
ఈ డిప్యూటేషన్ ఎవరి కోసం?
ఏపీ ఉద్యోగిని డిప్యూటేషన్‌పై తెలంగాణ రాష్ట్రంలో పనిచేయించుకోవాల్సిన అవసరం ఏముందని విద్యుత్ శాఖ పరిధిలోని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ డిప్యూటేషన్ ఎవరి ప్రయోజనాల కోసం చేశారని అంటున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో హైదరాబాద్మెగా సిటీలో వేల కోట్లు ఖర్చు చేసి అండర్ గ్రౌండ్ కేబుల్వర్క్ చేపడుతున్నారు. ఈ పనులన్నీ కూడా ఎస్పీడీసీఎల్ ఎలక్ట్రికల్ విభాగంలోనే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి డిప్యూటేషన్‌పై ఇక్కడికి వచ్చే ఎలక్ట్రికల్ డీఈఈ వల్ల ఏమైనా తప్పులు దొర్లితే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి ఉండదని చెబుతున్నారు.
