
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గత కొంతకాలంగా బాగా వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో 8 గంటల పని విషయంతో పాటుగా తన కొత్త సినిమాల ఎంపికలోనూ, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలతోనూ, దీపికా పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవలే, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (అక్టోబర్10) సందర్భంగా భారత దేశ మొట్టమొదటి మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపికై వార్తల్లో నిలిచింది.
ఈ క్రమంలోనే దీపికా పదుకొణె మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. మెటా AIకి తన గొంతును అందించిన తొలి భారతీయ సెలబ్రిటీగా దీపికా ఘనత సాధించింది. లేటెస్ట్గా దీపికా పదుకునే మెటా AI లో భాగమైనట్లు.. ఒక స్పెషల్ వీడియో ద్వారా తెలిపింది. ఈ మేరకు సోషల్‌మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
“సరే, ఇది చాలా బాగుందని నేను అనుకుంటున్నాను! నేను ఇప్పుడు మెటా AIలో భాగమయ్యాను. ఇండియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ అంతటా నా వాయిస్‌తో ఇంగ్లీషులో చాట్ చేయవచ్చు. మీరు దీన్ని ప్రయత్నించండి. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియజేయండి!” అని దీపికా వీడియో క్యాప్షన్‌లో తెలిపింది.
దీపికాతో ఎప్పుడైనా మాట్లాడచ్చు:
ఇటీవల మెటా ఓ స్పెషల్ AI చాట్‌బాట్ యాప్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇది మనతో చాటింగ్ చేయడమే కాకుండా వాయిస్‌తో సలహాలు, కబుర్లు కూడా చెబుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ఆరు దేశాలలో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త మెటా AI కి దీపికా పదుకొనె వాయిస్ ఆఫ్గా నిలిచింది. అంటే.. మెటా AIలో వచ్చే వివిధ రకాల టెక్స్ట్, ఇమేజ్, వీడియో డేటాలో.. మనం అడిగే ప్రశ్నలను AI విస్తృత స్థాయిలో అర్థం చేసుకుని, నటి దీపికా పదుకొనె వాయిస్‌తో సమాధానం ఇవ్వనుంది.
అంటే, యూజర్స్.. దీపికాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు అన్నమాట. కానీ, దీపికా వాయిస్ మాత్రం AI ఆధారంగా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు మెటా AIలో హాలీవుడ్ నుంచి కొంతమంది ప్రముఖుల వాయిస్‌లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇండియా నుంచి మాత్రం దీపికా పదుకొనె వాయిస్ మాత్రమే అందుబాటులోకి రావడం విశేషం.