
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలు సినీ ప్రపంచంలో పెద్ద ప్రకంపనలు సృష్టించాయి. ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగా తీయబోయే 'స్పిరిట్', నాగ్ అశ్విన్ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి దీపికా వైదొలగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నిర్ణయాల వెనుక ఆమె డిమాండ్ చేసిన '8 గంటల ఫిక్స్‌డ్ వర్కింగ్ షిప్ట్' విషయమే ప్రధాన కారణంగా వినిపిస్తోంది. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై దీపికా పదుకొణె మౌనం వీడారు. లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో సారి సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి.
హీరోలకు ఒక నీతి.. హీరోయిన్స్ కు ఒక నీతా?
తాను 8 గంటల పని వేళలు అడగడాన్ని 'పుష్‌గా' లేదా 'అతిగా' భావిస్తే అలాగే ఉండనీయండి అంటూనే, దీపికా చేసిన వ్యాఖ్యలు అగ్ర హీరోల పనితీరుపై కొత్త చర్చను లేవనెత్తాయి. మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది మేల్ సూపర్‌స్టార్‌లు సంవత్సరాలుగా కేవలం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ ఈ విషయం ఎప్పుడూ పెద్ద వార్తల్లోకి రాలేదు అని దీపికా ప్రశ్నించారు. అంతేకాదు, వారు సోమవారం నుంచి శుక్రవారం వరకే 8 గంటలు పనిచేస్తారు. వారాంతాల్లో అసలు పనిచేయరు అనే విషయం బహిరంగ రహస్యం అని ఆమె తెలిపారు.
ఒక మహిళగా, ముఖ్యంగా ఇటీవల తల్లిగా మారిన దీపికా, పని-జీవిత సమతుల్యత (Work-Life Balance) కోసం ఇలాంటి పని వేళలను డిమాండ్ చేస్తే.. దానిని 'నిబద్ధత లేని' చర్యగా చిత్రీకరించి పెద్ద చర్చనీయాంశంగా మార్చారని ఆమె తప్పుపట్టారు. ప్రస్తుతం దీపికా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'కల్కి 2898 AD' నుంచి ఎగ్జిట్
దీపికా కోరిన వర్కింగ్ షిఫ్ట్ కారణంగానే 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి ఆమెను తప్పించారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ విషయంలో నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. మేము జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మొదటి సినిమా కోసం సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ, మేము భాగస్వామ్యాన్ని కొనసాగించలేకపోయాము. కల్కి 2898 AD వంటి సినిమాకు మరింత అంకితభావం (commitment) అవసరం" అని వారు పేర్కొన్నారు. దీని వెనుక కూడా దీపికా 8 గంటల పని షిఫ్ట్ అడగడం, కొన్ని రిమ్యూనరేషన్ డిమాండ్లు కారణమని వార్తలు వచ్చాయి. ఇదేవిధంగా, ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందాల్సిన 'స్పిరిట్' చిత్రం నుంచి కూడా దీపికా వైదొలిగారు. దీనిపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా దీపికాను ఉద్దేశిస్తూ ఒక క్రిప్టిక్ నోట్ పోస్ట్ చేశారు. ఇది ఈ వివాదాన్ని మరింత పెంచింది.
షారుఖ్ 'కింగ్' తో సమాధానం!
ఈ విమర్శలు, ఊహాగానాల మధ్య ఏ మాత్రం నిరుత్సాహపడకుండా, దీపికా తన తదుపరి చిత్రం షారుఖ్ ఖాన్‌తో 'కింగ్' షూటింగ్‌ను ప్రారంభించారు. తన ఆరవ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌లో, "సినిమా విజయం కంటే, ఆ సినిమాను ఎవరితో కలిసి చేస్తున్నాం, ఆ అనుభవమే ముఖ్యం. ఆ పాఠాన్ని నేను అంగీకరిస్తున్నాను, ఇప్పటికీ నా ప్రతి నిర్ణయంలోనూ దాన్ని పాటిస్తున్నాను అని నోట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో పద్ధతులు మారాలనే విషయంలో ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. ..