బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను ఓడించండి : ఆకునూరి మురళి

బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను ఓడించండి : ఆకునూరి మురళి
  • ఈ రెండు పార్టీలు అహంకారపూరిత, అవినీతి ప్రభుత్వాలు: ఆకునూరి మురళి
  • మోదీ, కేసీఆర్ అబద్ధాలతో జనాన్ని మోసం చేస్తున్నారని ఫైర్‌‌‌‌‌‌‌‌

కరీంనగర్, వెలుగు : వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌ను ఓడించాలని జాగో తెలంగాణ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో, కేంద్రంలో అహంకారపూరిత, అవినీతి ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. జాగో తెలంగాణ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంది. ప్రొఫెసర్లు వినాయక రెడ్డి, లక్ష్మీనారాయణ, పద్మజాషాతో కలిసి శనివారం కరీంనగర్ ప్రెస్ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేసీఆర్ హామీ ఇచ్చిన కేజీ టు పీజీ అమలు కాలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేదలకు పంచలేదన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ను డల్లాస్‌‌‌‌ చేస్తామని సీఎం ప్రకటించారని, కానీ ఇంతవరకు అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. రైతు బంధు ద్వారా వందల కోట్లను భూస్వాములు, సినిమా హీరోలు, ఎన్‌‌‌‌ఆర్ఐలకు ఇస్తున్నారని మండిపడ్డారు.

ప్రధాని మోదీ కూడా అబద్ధాల పాలన చేస్తున్నారని, విదేశాల్లో నల్లధనాన్ని తీసుకొచ్చి రూ.15 లక్షలు వేస్తానని మోసం చేశారన్నారు. అందరూ చదువుకోవడం అనే కాన్సెప్ట్‌‌‌‌కు బీజేపీ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు. బడా పెట్టుబడిదారులకు రూ.16 లక్షల కోట్లను రైటాఫ్ చేశారని, అవే డబ్బులు విద్య, వైద్యానికి ఖర్చు చేస్తే అద్భుతమైన స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ నిర్మించే చాన్స్​ ఉండేదన్నారు. కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వినాయక రెడ్డి మాట్లాడుతూ.. దళితుల రూ.84 వేల కోట్లు, ఎస్టీలకు కేటాయించిన రూ.32 వేల కోట్లు పక్కదారి పట్టించారని ఆరోపించారు. ప్రభుత్వ స్కీమ్‌‌‌‌లు కేవలం ఎమ్మెల్యేల అనుచరులు, పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని మండిపడ్డారు. ఓయూ ప్రొఫెసర్ పద్మజాషా మాట్లాడుతూ, రాష్ట్రంలో నోరు విప్పితే కేసులు పెడుతున్నారని, మహిళలపై హింస పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌‌‌‌సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పర్ క్యాపిట పెరిగితే ప్రజల సంపద పెరిగినట్లు కాదని స్పష్టం చేశారు.